దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్నదే బిజెపి వ్యూహం. అందులోను ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎలాగైనా బిజెపిని బలోపేతం చేసి అధికారం చేజిక్కించుకోవాన్నలన్నదే బిజెపి ఆలోచన. సాక్షాత్తు పార్టీ కీలక నేత అమిత్ షా తిరుపతి లాంటి ప్రాంతంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ నేతలకు క్లాస్ ఇచ్చారు.
బిజెపిని పటిష్టం చేయడంలో విఫలమవుతున్నారని నేతలపై ఆగ్రహించారు. ఇలా అయితే కష్టం.. బిజెపి-జనసేన పార్టీలు కలిసి ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాల్సిన సమయం వస్తోంది.. త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవడం కాదు.
అందరూ కలిసి కట్టుగా ఉండాలి అన్నారు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి తరువాత బలంగా ఉన్న పార్టీ టిడిపి కాదని.. బిజెపి-జనసేనల కూటమి గట్టిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారం చేజిక్కించుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
అయితే ప్రజల్లోకి మనము వెళ్ళాలంటే సెంటిమెంట్‌గా ఏదో ఒకటి చేయాలి. వారి ప్రధాన డిమాండ్ ప్రత్యేక హోదా. టిడిపి ఇక లేవలేని స్థితికి వెళ్ళిపోయింది. వైసిపిపై వ్యతిరేకత ఎలాగూ ఉంది కాబట్టి అది మనకు బాగా కలిసొస్తుంది. ఇక హోదా ఇచ్చేది మనమే కాబట్టి ప్రజల్లో బిజెపిపై నమ్మకం ఏర్పడుతుంది.
త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హోదా బాగా కలిసి వస్తుందని సోము వీర్రాజుతో పాటు పలువురు ముఖ్య నేతలు బిజెపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది.
ఈ నెల 17వ తేదీన జరుగనున్న ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించనున్నారు. అంతే కాదు దీనిపై నిర్ణయం కూడా తీసుకుని హోదాను ఇవ్వబోతున్నారట. ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగమే.. అమిత్ షా ఇచ్చిన సలహాతోనే మోడీ హోదాను ఇవ్వడానికి సిద్థమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే జరిగితే బిజెపితో కలిసి ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఎం అయ్యే ఛాన్సు ఎక్కువగా ఉందంటున్నారు విశ్లేషకులు. మొదట్లో జనసేనానికి కొన్ని సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చి ఆ తరువాత బిజెపి తరపున ఒక వ్యక్తిని సిఎం చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మొత్తం మీద ప్రత్యేక హోదాతో బిజెపి-జనసేనలు ఖచ్చితంగా ఎపిలో అధికారాన్ని చేజిక్కించుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారట బిజెపి అగ్రనేతలు. మరి చూడాలి ఏం జరుగుతుందన్నది.