ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మరోమారు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వైఖరిని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పదేపదే నిలదీసిన తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబును ఏపీ సీఐడీ పోలీసులు గురువారం అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
"అధికారంలోకి వచ్చాక కొత్త సంవత్సర శుభకాంక్షలతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తానని ముద్దులు పెట్టి మరీ చెప్పారు. ప్రతి యేటా ఆరు వేల పోలీసు ఉద్యోగులు, 25 వేల టీచర్ పోస్టులు ఇస్తాను అని హామి ఇచ్చారు. కానీ డీఎస్సీ లేదు. గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు" అని అన్నారు.
పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పది వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వేసినా, ఇప్పటికీ అవి భర్తీ కాలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చి, ఇపుడు నెరవేర్చడం మర్చిపోయారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ హామీలపై నిలదీసేందుకు కలెక్టరేట్ల వద్దకు వెళ్లిన యువతిపై లాఠీ చార్జీలు చేయించి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.