షిరిడీ వెళుతున్నారా...? అయితే ఇది ఖచ్చితంగా చదవాల్సిందే..?

బుధవారం, 24 అక్టోబరు 2018 (21:18 IST)
తిరుమల శ్రీవారి ఆలయం తరువాత భక్తులు ఎక్కువ సంఖ్యలో సందర్శించే ఆలయంగా మహారాష్ట్రలోని షిరిడీ దేవాలయం పేరు పొందింది. రోజూ వేలాది మంది శిరిడీ సాయినాధుని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువ సంఖ్యలో శిరిడీని సందర్శిస్తున్నారు. అయితే శిరిడీ సంస్థాన్‌ తెలుగు భక్తులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
 
షిరిడీలో ఎటు చూసినా తెలుగువారే కనిపిస్తున్నారు. తెలుగు ప్రాంతాల నుంచి షిరిడీ వెళ్లే రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఏ క్షణంలో షిరిడీ ఆలయ క్యూ లైన్లలోకి వెళ్లినా వేలాది మంది తెలుగు భక్తులు తారసపడతారు. షిరీడిని సందర్శించే వారిలో మరాఠీల తరువాత తెలుగు భక్తులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. అయితే… ఆలయంలో సూచిక బోర్డులు కూడా తెలుగులో లేవు. 
 
ఇన్షర్మేషన్‌ సెంటర్లలోనూ తెలుగులో మాట్లాడేవారు కనిపించడం లేదు. తిరుమలను సందర్శించే భక్తుల్లో తెలుగువారి తరువాత తమిళ, కన్నడ భక్తులుంటారు. అందుకే తిరుమలలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హింది, ఇంగ్లీషు భాషల్లో సూచిక బోర్డులు కనిపిస్తాయి. టిటిడి ఇన్ఫర్మేషన్‌ సెంటర్లలో నాలుగైదు భాషలు తెలిసిన వారిని నియమించి సమాచారం అందిస్తుంటారు. అటువంటి ఏర్పాట్లు ఏవీ షిరీడిలో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి శిరిడి వెళుతున్న భక్తులు అవస్థలు పడుతున్నారు.
 
షిరీడిలోనూ దర్శన దళారులు దర్శనమిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనం చేయిస్తామంటూ భక్తులకు వల వేస్తున్నారు. అక్కడ వ్యాపారుల రూపంలో కనిపిస్తున్న దళారులు, తమ వద్ద పూజా సామగ్రి కొనుగోలు చేస్తే సులభంగా దర్శనం చేయిస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. రూ.100 విలువ కూడా చేయని పూజా సామగ్రిని రూ.500 నుంచి రూ.1000కు అంటగడుతున్నారు. సెల్‌ ఫోన్లు ఉచితంగా భద్రపరుస్తామంటూ దుకాణాల్లో లాకర్లు పెట్టుకున్న వ్యాపారులు… తిరిగి వచ్చిన తరువాత ప్రసాదాలను అధిక ధరలకు అమ్ముతున్నారు.
 
షిరిడీని దర్శించే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా అందుకు తగినంతగా బస ఏర్పాట్లను దేవస్థానం చేయలేదు. దీంతో ప్రైవేట్‌ లాడ్జీలే దిక్కవుతున్నాయి. ఈ లాడ్జీలు దూర ప్రాంతాల ప్రయాణీకులను నిలువునా మోసం చేస్తున్నాయి. లాడ్జీలో దిగేటప్పుడు ఒక ధర చెప్పి…. రెండో రోజు ఇంకో ధర చెబుతున్నారు. లాడ్జీలో దిగిన రోజు రూ.800 ధర చెప్పి, రద్దీ పెరిగినందున ధర పెంచామంటూ రెండో రోజు రూ.2000 ఇవ్వాల్సిందే అని పట్టుబట్టిన ఓ లాడ్జీ నిర్వాహకుల నిర్వాకం బయటకు వచ్చింది. ఆలయం తరపున అన్న ప్రసాద వితరణ వంటిది ఎక్కడా కనిపించలేదు.
 
అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న షిరిడీ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రోడ్లు లేవు. శిరిడీ వెళ్లే భక్తులంతా నాసిక్‌ను సందర్శిస్తుంటారు. 65 కిలోమీటర్ల దూరంలోని నాసిక్‌ పట్టణానికి చేరుకోడానికి రెండు గంటల సమయం పడుతోందంటే రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు శని సింగానూరుకు వెళ్లాలన్నా ఇదే పరిస్థితి. సాఫీగా ఉన్న రోడ్డు ఒక్కటి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ రోడ్లు కూడా అంత అధ్వానంగా లేవనిపిస్తుంది. టూరిజం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వానికి బాగానే ఆదాయం వస్తున్నా…. పర్యాటకుల గురించి అక్కడి ప్రభుత్వానికి పెద్దగా పట్టినట్లు లేదు.
 
షిరిడి సంస్థాన్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వమూ భక్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. శిరిడీకి ఇటు తెలుగు రాష్ట్రాలు, అటు కర్నాటక నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లను శిరిడి సంస్థాన్‌ చేయాలి. భక్తులు మోసపోకుండా చర్యలు చేపట్టాలి. రోడ్లను మెరుగుపరచి పర్యాటకులకు అవస్థలు తప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మరి ఫడ్నవిస్ ఏం చేస్తారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు