చరిష్మాతో ఓట్లు సంపాదించుకోలేమని చాలామంది సినీనటులు రాజకీయాల్లోకి వచ్చి నిరూపించారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఆయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇక రెండవది ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఎపి రాజకీయాల్లో చారిత్రాత్మకమన్న ఒక ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బిజెపితో జతకట్టడం ఆ పార్టీకే నష్టమన్న ప్రచారాన్ని వైసిపి నేతలు చెబుతున్నారు. బిజెపి కేంద్రంలో చక్రం తిప్పుతోంది. ఆ పార్టీలో కనీసం కొంతమంది నేతలైనా జనాల్లో తిరుగుతున్నారు. ఆ పార్టీకి అంతోఇంతో పేరన్నా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో ఎప్పుడూ సింగిల్. ఇక నాదెండ్ల మనోహర్ అంటారా ఆయన తప్ప ఇంకెవరూ పెద్దగా చెప్పుకునే నాయకులు లేరు.
పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు వచ్చే వారిలో ఎక్కువమంది యువతే ఉన్నారు. వారందరూ ఓట్లేస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇదంతా తేలిపోయింది. జనసేన పార్టీ ప్రస్తుతం వెనక్కి వెళ్ళిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు కారణం ఉన్న ఒక్క ఎమ్మెల్యే కాస్త వైసిపి వైపు చూడడం.. జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం.