నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎక్కడికీ కదలదని భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని ఆ పార్టీ అధిపతులు కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్‌లు స్పష్టం చేశారు.
ఇరు పార్టీల నేతల సమావేశం గురువారం విజయవాడలో జరిగిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ, అసెంబ్లీలో 151 మంది శాసనసభ్యులు ఉన్నారనీ, తాము ఏమైనా చేస్తామని అనుకుంటే కదరదన్నారు. అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనివ్వబోమని తేల్చిచెప్పారు.
ఏపీ భవిష్యత్, రాష్ట్ర ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతోందని ఆక్షేపించారు. 'రాష్ట్ర రాజధానిగా అమరావతిని అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ లోపల, బయటా అంగీకరించాయి. ఇప్పుడు జగన్ దానిని మారుస్తానంటూ ఏకపక్షంగా ముందుకెళ్తే ఎలా సాధ్యమవుతుంది? బీజేపీ-జనసేన ఉమ్మడి పోరాటంతో ప్రజల్లోకి వెళ్తాయి' అని స్పష్టం చేశారు.
ఆ తర్వాత బీజేపీ ఢిల్లీ దూత, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ డియోధర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు కులం, కుటుంబం, అవినీతి, అరాచకమనే గ్రహణాలు పట్టాయి.. జాతీయవాదం, అవినీతి రహితం, ప్రజా సంక్షేమం అనే ఆయుధాలతో వాటిని ఓడిస్తాం.. బంగారు ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం అని చెప్పుకొచ్చారు. మరో జాతీయ నే జీవీఎల్ నరసింహా రావు స్పందిస్తూ, రెండు పార్టీలు కలవడం శుభపరిణామమని, విజయ బావుటా ఎగురవేస్తామని అన్నారు.