చిన్నమ్మకు వణుకు పుట్టిస్తున్న జయలలిత మేనకోడలు

గురువారం, 19 జనవరి 2017 (10:45 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిగా చక్రం తిప్పాలని ఆశిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌కు జయ మేనకోడలు దీపా జయకుమార్ వణుకు పుట్టిస్తున్నారు. తానే జయలలితకు అసలైన వారసులినంటూ చిన్నమ్మకు సవాల్‌ విసురుతున్నారు. దీపకు పెరుగుతున్న జనాదరణను చూసి శశికళ వర్గీయులు షాకవుతున్నారు. అన్నాడీఎంకే రాజకీయాలు శశికళ వర్సెస్ దీప అన్నట్టుగా మారాయి. దివంగత నేత ఎంజిఆర్ శతజయంతి వేడుకలు ఇరువర్గాల బలప్రదర్శనకు వేదికయ్యాయి.
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ గురువు ఎంజిఆర్ శతజయంతి సందర్భంగా మంగళవారం ఉదయం చెన్నై మెరీనాబీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అన్నాడిఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. దీప మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీపకు మద్దతుగా నినాదాలు చేస్తూ జయ వారసురాలు ఆమేనంటూ బలప్రదర్శనకు దిగినంత పనిచేశారు. దీంతో శశికళ వర్గం ఖంగుతింది. ఎంజిఆర్‌ సమాధి వద్దకు తరలివచ్చిన శశికళ వర్గీయులు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేయడంతో మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. భారీ ప్లకార్డులు పట్టుకుని దీప వర్గీయులు హడావిడి చేశారు.
 
జయలలిత, ఎంజిఆర్ సమాధుల వద్ద నివాళులు అర్పించిన దీప నేరుగా తన రాజకీయ రంగప్రవేశంపై మాట్లాడారు. తాను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చేశానని, కొత్తగా రావాల్సిందేమీ లేదని అంటోంది. ఫిబ్రవరి24వ తేదీన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పింది. దీంతో ఒక్కసారిగా శశికళకు, ఆమె అనుచరులకు భయం పట్టుకుంది. ఇప్పటికే దీప అందరినీ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది కాస్త శశికళ వర్గీయులకు ఏ మాత్రం నచ్చడం లేదు. 
 
శశికళే స్వయంగా కొంతమందిని నియమించి దీప కదలికలను తెలుసుకోవాలని చెప్పారట. దీంతో కొంతమంది దీపను వెంబడిస్తూ ఆమె ఎక్కడకు వెళ్ళినా ఆమె వెంటే తిరుగుతూ ప్రతి కదలికను చిన్నమ్మకు చేరవేస్తున్నారట. మొత్తం మీద దీప వ్యవహారం శశికళకు తలనొప్పిగా మారింది. అంతేకాదు ముఖ్యమంత్రి అవ్వాలన్న శశికళ ఆశలకు దీప జయకుమారు గండికొడుతున్నారట. 

వెబ్దునియా పై చదవండి