తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:33 IST)
తెలంగాణలో తమ సత్తా చాటేందుకు తెలుగుదేశం పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఈ సింపథీని క్యాష్ చేసుకునే దిశగా తెలంగాణలో పావులు కదిపేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీడీపీ అధిష్టానం హరికృష్ణ కుమారుడు, నటుడు, నిర్మాత కల్యాణ్ రామ్‌ను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను వచ్చే ఎన్నికల్లో దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితితో కూడిన మహాకూటమి పకడ్బందీ వ్యూహాన్నే రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకుల వారసులను ఎన్నికల బరిలోకి దింపేందుకు మహా కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ క్రమంలోనే దివంగత నేత ఎన్టీ రామారావు మనవడు, హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్‌ను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి దించే ఆలోచనలో వున్నట్లు సమాచారం. అంతేగాకుండా కల్యాణ్‌రామ్‌ను మహాకూటమి తరఫున శేరిలింగంపల్లి లేదా కూకట్‌పల్లి నుంచి పోటీకి దింపేందుకు టీడిపి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
  
కాంగ్రెస్‌ నేతలు కూడా కల్యాణ్‌రామ్‌ను పోటీకి దించే ఆలోచనకు జైకొట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే ఆ సీటు వదులుకోవడానికి సిద్ధమేనని అంగీకరించినట్లు తెలిసింది. కల్యాణ్‌రామ్‌ కుటుంబ సభ్యులతో కొంత మంది టీడీపి నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మాజీ  ముఖ్యమంత్రి, దివంగత నేత చెన్నారెడ్డి మనవడు, మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యరెడ్డిని తెలంగాణ జనసమితి నుంచి పోటీకి దించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు