అమరావతి కోసం ఆహ్వానించి.. అవమానించిన ఏపీ సర్కారు : జపాన్ ఆర్కిటెక్ట్ సంస్థ ఆరోపణలు

సోమవారం, 30 జనవరి 2017 (12:31 IST)
రాజధాని అమరావతి మరో వివాదానికి వేదికైంది. ఈసారి ఏకంగా సీఆర్‌డిఏపై జపాన్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సదరు జపాన్ సంస్థ సుధీర్ఘమైన లేఖను రాసింది. తొలుత రాజధాని మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిపుణులతో కమిటీని నియమించింది. పలు అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాసిది. మాస్టర్ ఆర్కిటెక్ పోటీల్లో పాల్గొనాలంటూ జపాన్‌కు చెందిన ప్రముఖ మకీ అసోసియేట్స్‌కు 2015 డిసెంబరులో ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మకీ సంస్థతో పాటు పలు కంపెనీలు పోటీలు పాల్గొన్నాయి. చివరకు మకీ సంస్థ ముందు వేరే సంస్థ నిలువలేకపోయింది. మాస్టర్ ఆర్కిటెక్‌గా మకీ సంస్థను ఎంపిక చేస్తున్నట్లు 2016 ఏప్రిల్‌లో సీఆర్‌డీఏ ప్రకటించింది.
 
ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. మొదట మకీ సంస్థ రాజధాని డిజైన్ అప్పగించగా చంద్రబాబు కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులతో డిజైన్ చేసేందుకు మకీ సంస్థ అంగీకరించింది. కానీ హఠాత్తుగా మకీ సంస్థకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. మరోసారి మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికకు ఆహ్వానాలు పంపారు. మొత్తం ఏడు సంస్థలు స్పందించగా అర్హతల విషయంలో ఆఖరి స్థానంలో నిలిచిన హఫీజ్ కాంట్రాక్టర్ అనే సంస్థకు అప్పగించేశారు. 
 
ఈ విషయంపై తెలిసి మకీ సంస్థ అవాక్కయింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులో చంద్రబాబు ప్రభుత్వంపై పలు తీవ్ర ఆరోపణలు చేసింది. ఏపీ రాజధాని నిర్మాణంలో పారదర్శకత లేదని వివరించింది. ఏపీ పెద్దల వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది.
 
ఏపీ ప్రభుత్వమే తమను ఆహ్వానించిందని చివరకు అవమానకరరీతిలో ఒప్పందం రద్దు చేశారని ఆవేదన చెందింది. ఏపీ ప్రభుత్వం భారతదేశ పరువును కూడా ఫణంగా పెట్టిందని మకీ చీఫ్‌ పుమిహికో లేఖలో అభిప్రాయపడ్డారు. ఇకపై భారత్‌లో పనిచేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లు ఎవరూ సాహసం చేసే పరిస్థితి ఉండదని మకీ సంస్థ కేంద్రప్రభుత్వానికి రాసిన లేఖలో వెల్లడించింది.
 
సదరు లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా మకీ సంస్థ పంపింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై మరో కోణంలోనూ అనుమానాలు బలపడుతున్నాయి. రాజధానిలాంటి గొప్ప నిర్మాణానికి ఎంతో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్‌లు అవసరం. కానీ చంద్రబాబు మాత్రం ఆ మధ్య బాహుబలి సినిమా చూసి రాజమౌళిని సంప్రదించారు. డిజైన్ తయారు చేయాలని కోరారు. 
 
శాతకర్ణి సినిమా చూసిన తర్వాత మనసు మార్చుకున్న చంద్రబాబు కొద్దిరోజుల క్రితం డైరెక్టర్ క్రిష్‌ వద్దకు అధికారులను పంపారు. ఏపీ రాజధాని నిర్మాణ డిజైన్ తయారీలో సహకరించాలని కోరారు. ఈ ఆశ్చర్యకరమైన పోకడలు చూసి అధికారులు, ఆర్కిటెక్ట్‌లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఏకంగా జపాన్ సంస్థ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి