మెగా ఫ్యామిలీకి దూరం మంచిదే అని పవన్ అనుకుంటున్నాడా...!

శుక్రవారం, 25 నవంబరు 2016 (15:51 IST)
పవన్‌ కళ్యాణ్‌.. ఈ మాటలు ఇపుడు యువతకు ఒక సిద్ధాంతంగా మారాయి. మరికొంతమందికి నినాదమైంది. భవిష్యత్తులో విధానంగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. కేవలం పార్టీని మాత్రమే పెట్టాడు. ఒక సమస్యపై పోరాడ లేదు. ఒకచోట పోటీ చేయలేదు. కానీ రాబోయే ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ను ప్రధాన పోటీదారుడిగా చూస్తున్నారు ప్రజలు. అలాగని గాలివాటంగా వస్తున్న స్పందనా అంటే అదీ కాదు. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయ పార్టీలు కూడా తక్కువ అంచనా వేయడం లేదు. సినిమా హీరో కాబట్టి ఇవన్నీ మామూలే అని చాలామంది అనుకున్నారు.
 
రేపు రాజకీయాల్లోకి వచ్చినా ఇది మరో నీటి బుడగ తప్ప మరొకటి కాదన్నవారు ఉన్నారు. పవన్‌ ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసేవాడే. దానికి ప్యాకప్‌ చెప్పిన తర్వాత దాని ప్రభావం చిరంజీవి మీద చాలానే పడింది. కానీ పవన్‌ కళ్యాణ్‌‌ను మాత్రం వేరుగా చూస్తున్నారు. దానికి అన్నతో పవన్‌ మెయిన్‌‌టేన్‌ చేస్తున్న డిస్టన్సే కారణం అంటున్నారు. ఎవరు అవును అన్నా కాదన్నా రాజకీయంగా చిరంజీవి పూర్తిగా బదాం అయినాడు. అదే కుటుంబం నుంచి అన్నతో ఎమోషనల్‌ అటాచ్‌ ఉన్న తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంతో కొంత ప్రభావం అయితే ఉండాలి. 
 
కానీ నేను వేరు, చిరంజీవి వేరు అనే అభిప్రాయాన్ని కలిగించడంలో పవన్‌ చాలా వరకు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. అందుకే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కొన్ని కార్యక్రమాలకు పవన్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక అన్నకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు దూరంగానే ఉండాలని భావిస్తున్నారట. గతంలో చరణ్‌ హీరోగా పవన్‌ నిర్మాతగా ఒక సినిమా రాబోతుందని ప్రచారం జరిగింది. 
 
కానీ ఉన్నట్టుండి తన అభిమాని నితిన్‌తో పవన్‌ కళ్యాణ్‌ సినిమాకు సిద్ధమవుతుండటం చిరంజీవి ఫ్యామిలీకి ఆశ్చర్యాన్ని కలిగించింది. పవన్‌కు తీరిక లేకే రావడం లేదంటూ కవర్‌ చేస్తూ వచ్చింది చిరంజీవి ఫ్యామిలీ. కానీ పవన్‌ అభిమానులు చిరంజీవిని చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దీంతో భవిష్యత్తులో వాడు వేరు నేను వేరు అని మెగాస్టార్‌ చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. 
 
పవన్‌ కూడా నా కుటుంబాన్ని కాదని నేను తెదేపాకు, బిజెపీకి మద్దతు ఇస్తూ వచ్చానని ప్రతి సభలోను చెబుతూనే ఉన్నాడు. అంటే తాను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే అన్న నిజాన్ని పవన్‌ చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్‌ లైన్‌ తనను ఇంతట వాడిని చేసింది అనుకున్న పవన్‌ ఇప్పుడు ఇలా అన్నను పక్కనబెట్టడం చూస్తే నీడ ఇవ్వని చెట్టు మన పెరిటిలోదే అయినా ఉపయోగం ఉండదన్న సూక్తి గుర్తుకు రాక మానదు.

వెబ్దునియా పై చదవండి