ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కింగ్ మేకర్‌ అవుతారా? 48గంటల గడువు ఎందుకు?

బుధవారం, 23 మే 2018 (17:03 IST)
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం‌లో కొనసాగుతోంది. పోరాట యాత్రకు అటు పవన్ అభిమానులు ఇటు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రజల్లోకి వెళ్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. పవన్ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు తానున్నానని భరోసా ఇస్తున్నారు.
 
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడంలో టీడీపీ.. అధికార పార్టీని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన వైసీపీ తమ బాధ్యతను విస్మరించాయని జనసేన ఏకిపారేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలను నిలదీస్తూ పోరాట యాత్ర కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్... మిస్సైల్ లాంటి మాటలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు.. తెలుగుదేశంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన పవన్.. చంద్రబాబుపై ప్రశ్నలు సంధిస్తూ టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక బీజేపీనికూడా పవన్ వదిలిపెట్టట్లేదు. 
 
పవన్ పోరాట యాత్రలో ప్రజలకు చేరువవుతూ.. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రజలు తమను ఆదరించాలంటూ పవన్ విజ్ఞప్తి చేస్తున్నారు. పోరాట యాత్ర విజయవంతం అయితే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కింగ్ మేకర్‌గా మారుతారని జోస్యం చెప్తున్నారు.
 
ఇకపోతే.. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కొత్త ఆరోగ్య శాఖకు మంత్రిని నియమించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు