తెలంగాణాలో ప్యాకప్ చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో జెండా పాతేద్దాం.. పవన్ కళ్యాణ్ వ్యూహమిదేనా?

మంగళవారం, 1 నవంబరు 2016 (16:38 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ (తెలంగాణ రాష్ట్రం)లో ఉన్న తన ఓటు హక్కును రద్దు చేసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా హైదరాబాద్ నుంచి మకాం మార్చనున్నారు. ఈ నిర్ణయం వెనుక ఆయన భారీ ప్రణాళికనే రచించుకున్నట్టు తెలుస్తోంది. 
 
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2019లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోపు తన సొంత పార్టీ జనసేనను మరింత బలోపేతం చేసి ఎన్నికల గోదాలోకి దూకాలన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఏపీలో ఓటు హక్కును కలిగివుండాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగా ఏలూరులో ఓటరుగా నమోదు కావాలని నిశ్చయించినట్టు తెలుస్తోంది.
 
ఇప్పటికే పార్టీ ఆఫీసుగా, తన నివాసంగా ఉపయోగపడే భవనాన్ని ఏలూరులో గుర్తించాలని కార్యకర్తలకు పవన్ సూచించారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం మిగతా పార్టీల్లో కుతూహలాన్ని రేకెత్తించగా, పవన్ ఆలోచన ఏంటని వివిధ పార్టీల వారు జనసేన నాయకులను అడుగుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క, ఇప్పటికే కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ పడుతుందని జనసేన అధినేత వెల్లడించగా, తాజా చర్యలతో గెలుపు గుర్రాలను గుర్తించి వారికి టికెట్లు ఇచ్చేందుకు పవన్ ముందడుగు వేస్తున్నట్టు సమాచారం. 
 
ఏపీలో ఉంటే జనసేనను బలోపేతం చేయడంతో పాటు, ప్రజల మధ్య ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. ఇదేసమయంలో తెలంగాణలో జనసేన ఉండదా? ఉంటే ఇక్కడ బలోపేతం చేయాల్సిన అవసరం లేదా? హైదరాబాద్‌ను వదిలి ఏపీకి వెళితే తెలంగాణలో పార్టీ కార్యకర్తల మనోధైర్యం తగ్గదా? అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ పవన్ కల్యాణ్ నోరు విప్పితేగానీ సమాధానాలు లభించవు. 

వెబ్దునియా పై చదవండి