తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్. 1980 బ్యాచ్ అధికారి. తెలుగోడు దువ్వూరి సుబ్బారావు తర్వాత ఆర్‌బీఐ ఉన్నత పదవికి ఎంపికైన ఐఏఎస్ కేడర్ అధికారి ఆయనే. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సభ్యుడుగా కొనసాగుతున్నారు. జీ-20లో భారత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 2015 నుంచి 2017 మే వరకు ఆర్థిక వ్యవహారాల శాఖలో పని చేశారు.
తొలుత రెవెన్యూ శాఖ కార్యదర్శిగా దాస్‌ను తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సమర్థతను గుర్తించి ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమించారు. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు ప్రకటిస్తూ తీసుకున్న నరేంద్ర మోడీ నిర్ణయానికి గట్టిగా మద్దతు తెలిపారు. వ్యవస్థలో నగదు కొరత తక్కువగా ఉన్న సమయంలో ఆర్‌బీఐ మౌనం వహించినా దాస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తూ సమర్థవంతమైన కీలక పాత్ర పోషించారు.
అలాగే డీమానిటైజేషన్ వల్ల నకిలీ కరెన్సీ వెల్లువ తగ్గి డిజిటల్ లావాదేవీలకు మంచి మద్దతు లభిస్తుందని గట్టిగా వాదించారు. డీమానిటైజేషన్ వల్ల వృద్ధి దెబ్బ తింటుందన్న వాదాన్ని ఆయన తిప్పికొట్టారు. నోట్ల రద్దుకు మద్దతుగా ఆయన నిలబడిన తీరుపై డెమో వ్యతిరేక వర్గాలు తీవ్ర స్వరంతో విమర్శలు కూడా గుప్పించాయి. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కితగ్గలేదు.
ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నారు. 61 యేళ్ళ శక్తికాంత దాస్ గత 2017 మే నెలలో పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అవసరమైనపుడల్లా సూచలు, సలహాలు ఇస్తూ పీఎంవోకు అత్యంత సన్నిహితుడిగా మారారు. దీంతో మోడీ నమ్మదగిన వ్యక్తుల జాబితాలో శక్తికాంత దాస్ ఒకరుగా ఉన్నారు. ఇవన్నీ బేరీజు వేసిన తర్వాతే ఆయన్ను ఆర్బీఐ నూతన గవర్నరుగా నియమిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకోవడంతో దానికి కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలపడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.