తెలంగాణ రాష్ట్రంలో నేతలకు తమ వారసుల నుంచి సన్‌స్ట్రోక్ మొదలైంది. వీరి ఆగడాలను అడ్డుకోకపోతే అసలుకే మోసం వచ్చేలా ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక తెరాస నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కొంతమంది అమాత్యుల కుమారులపై వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జోగు రామన్న కుమారుడు ఓ హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాధితుల ఆందోళనతో జోగు రామన్న కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఓ మహిళ విషయంలో చేసుకున్న జోక్యం.. తీవ్ర దుమారం లేపింది. మరో మంత్రి పద్మారావు తనయుడు ఓ వ్యాపారి కుటుంబాన్ని చితకబాదడంతో సౌమ్యుడిగా పేరున్న మంత్రికి కూడా ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా వివాదాల్లో తలదూర్చడం అధికార పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇక నియోజకవర్గాల్లో నేతల కుటుంబ సభ్యులు, తనయుల జోక్యం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం శృతిమించడంతో వివాదాలు తీవ్రమవుతున్నాయి. మంత్రులు పోచారం, జూపల్లి తనయులు నియోజకవర్గాలతో పాటు రాజధానిలో కూడా సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలతో వారిద్దరూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా నేతలు.. తమ కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోకపోతే.. పదవులకే ఎసరు వచ్చే అవకాశం ఉందంటుని తెరాస నేతలు హెచ్చరిస్తున్నారు.