మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని రాజకీయ స్వార్థం కోసం ఆ ఇద్దరు నేతలు వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వీరెవరూ అర్థమై ఉంటుంది. ఒకరు ఓపిఎస్ (పన్నీరు సెల్వం), మరొకరు ఇపిఎస్ (పళణిస్వామి). ఒకరు ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం కోసమైతే, మరొకరు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు ప్రయత్నించడం. జయలలిత బతికి ఉన్నప్పుడు ఆమెకు వీరిద్దరు నమ్మినబంటులే. కానీ ఇప్పుడు ఆమె మరణాన్నే స్వార్థం కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు.
జయ మరణం తరువాత రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడిఎంకే, శశికళ జైలుకు వెళ్లిన తరువాత మూడు వర్గాలుగా మారిపోయింది. కానీ ఇప్పుడు పన్నీరుసెల్వం, పళణిస్వామిలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరికి పదవులే ముఖ్యం. అటు ప్రభుత్వ పదవులు, ఇటు పార్టీ పదవులు రెండింటిని అనుభవించాలనేది వీరి ఆలోచన. అయితే పళణిస్వామి ఇప్పటికే అన్ని పదవులు పట్టుకొని ఉంటే పన్నీరు సెల్వంకు మాత్రం ఏ పదవి లేదు. కానీ పన్నీరుసెల్వంకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పళణిస్వామి తప్పుకోవాలన్నదే ఆయన వర్గీయుల డిమాండ్. అందుకే ఇద్దరూ కలవడం కాస్త ఆలస్యమవుతోంది.
ఉప ముఖ్యమంత్రి పదవిని పన్నీరుకు ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోని పళణిస్వామి ఎలా ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్నదే ఆయన వర్గీయుల ప్రశ్న. జయ మృతిపై విచారణ జరుగుతున్న విషయం బాగానే ఉన్నా వీరిద్దరి జరుగుతున్న రాజకీయ నాటకంపై మాత్రం తమిళ ప్రజలు విసిగిపోయారు. పదవుల కోసం వీళ్ళు పడుతున్న తాపత్రయం ప్రజలకు కంపరం తెప్పించే పరిస్థితికి తీసుకొస్తోంది.