మారనున్న తెలంగాణ పొలిటికల్ ముఖచిత్రం : టీడీపీ - కాంగ్రెస్ దోస్తానా? చంద్రబాబు ఏమన్నారు?

గురువారం, 27 ఏప్రియల్ 2017 (13:46 IST)
తెలంగాణాలో రాజకీయ ముఖచిత్రం మారనుంది. ఆ రాష్ట్రంలో అధికార తెరాస కారు స్పీడుకు విపక్ష పార్టీలు ఎదురొడ్డి నిలబడలేక పోతున్నాయి. దీంతో చేతులు కలపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా బద్దశత్రువుగా పరిగణించి కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ దోస్తీ కట్టనుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతో ఉన్న సంబంధాలను తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని టీ టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా వ్యాఖ్యానించడం విశేషం. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి రాజకీయ స్వేచ్చ (పొలిటికల్ ఫ్రీడం) ఇవ్వాలని అయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. మంగళవారం ఏపీ సచివాలయంలో బాబును కలిసిన ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.
 
వివిధ రాష్ట్రాల్లో బీజేపీ భిన్న వైఖరులను పాటిస్తుంది. ఈ దృష్ట్యా, తెలంగాణాలో ఆ పార్టీతో మేమెలా సఖ్యతతో ముందుకు వెళ్తామని తాను చంద్రబాబును ప్రశ్నించానని రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో రానున్న ఎన్నికల్లో టీటీడీపీ తన సొంత వ్యూహాలతోముందుకు వెళ్ళేలా స్వేచ్చ నివ్వాలని, అవసరమైతే ప్రతిపక్షాలతో పొత్తును కుదుర్చుకునే ఫ్రీడం ఇచ్చినా మంచిదేనని తను బాబును కోరినట్టు ఆయనచెప్పారు.

వెబ్దునియా పై చదవండి