రమణదీక్షితులు పనైపోయింది, టిటిడి ఛైర్మన్- సిఎం సీరియస్?

శుక్రవారం, 17 జులై 2020 (21:20 IST)
రమణ దీక్షితులు వ్యవహారం మరోసారి టిటిడిని కుదిపేస్తోంది. తనను ప్రధాన అర్చకులుగా నియమించక పోవడం, అర్చకుల రిటర్మెంట్ ఉపసంహరించుకోక పోవడం వంటి వాటిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన తాజాగా ఆలయంలో అర్చకులు కరోనా బారిన పడుతున్నా అధికారులు దర్శనాలు కొనసాగించడంపై ట్విటర్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోసారి చర్చనీయాంశంగా మారారు.
 
టిటిడి మాజీ ప్రధాన అర్చకులు ప్రస్తుత గౌరవ ప్రధానార్చకులు ఆయన రమణ దీక్షితులు మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. గతంలో  టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వార్తలకెక్కారు. అంతటితో ఆగకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. శ్రీవారి పింక్ డైమండ్ మాయమైంది అనీ, నగల భద్రత కరువైందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన వ్యాఖ్యలతో అప్పటి టిటిడి బోర్డుతో పాటు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో అధికారులపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.
 
అప్పటి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే ఇప్పటికీ టిటిడి అధికారులు పని చేస్తున్నారంటూ ఆరోపించారు. అలాగే తిరుమల ఆలయంలో కైంకర్యాలు నిర్వర్తిస్తున్న 15 మంది అర్చకులకు కరోనా సోకినా దర్శనాలు కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు అర్చకుల ఆరోగ్యంపై శ్రద్ధ లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
 
మరోవైపు రమణ దీక్షితుల ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి. సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీవారికి కైంకర్యాలను నిర్వహించే అర్చకులు అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. అర్చకుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్చకుల అభిప్రాయాలకు టిటిడి గౌరవం ఇస్తుందని అన్నారు.
 
ఇక రమణ దీక్షితులు అసహనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా గత టిడిపి ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నపుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి రమణ దీక్షితులకు మద్దతు ఇచ్చింది. రమణదీక్షితులు స్వయంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి టిడిపి ప్రభుత్వం పైన, టిటిడి విధానాల పైన ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీలో ప్రభుత్వం మారితే అర్చకులకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని ఆయన భావించారు. మళ్లీ తను ప్రధాన అర్చకుడిగా శ్రీవారి గర్భాలయంలో అడుగుపెట్టి శ్రీవారిని తాకి సేవలు చేసే అవకాశం కలుగుతుందని ఆశపడ్డారు.
 
అయితే ఆయన ఆశలు పూర్తిస్థాయిలో ఫలించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఆయన్ను ప్రధాన అర్చకులుగా టీటీడీ నియమించలేదు. అలాగే అర్చకులు రిటైర్మెంట్ జీవోను కూడా ఉపసంహరించుకోలేదు. కేవలం కంటితుడుపు చర్యగా రమణదీక్షితులను గౌరవ ప్రధాన అర్చకులుగా మాత్రమే నియమించింది. అలాగే ఆగమ సలహాదారుగా కూడా అవకాశం ఇచ్చింది.
 
అయితే ఈ నిర్ణయానికి రమణదీక్షితులు సంతృప్తిగా లేరు. అర్చకుల రిటైర్మెంట్‌ను తొలగించాలని తాను మళ్లీ ప్రధాన అర్చకులు హోదాలో శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కాలని ఆయన కోరుతున్నారు. ఈ అసంతృప్తిని ఆయన ట్విట్టర్ ద్వారా తరచూ వెళ్లగక్కుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా టిటిడి అధికారులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీఎం జగన్‌ను కూడా పలుసార్లు కలిసినప్పటికీ ఇంకా తన కోరిక ఫలించకపోవడంతో ఆయన అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
దీనికితోడు రిటైర్మెంట్ టైం దగ్గర పడిన అర్చకులకు కరోనా సోకిన కారణంగా ముందస్తు రిటైర్మెంట్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారంటూ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహం కలిగించాయి. అసలు రిటైర్మెంట్‌ను తాను వ్యతిరేకిస్తుంటే ముందస్తు రిటైర్మెంట్ ప్రతిపాదనపై ఏమిటనే అసహనంతో వున్నారు. అందుకనే అర్చకుల మీద ప్రేమ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనo నిలిపివేయడం మంచిదని ఆయన కోరుతున్నారు.
 
ఇక ప్రభుత్వం మారినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో రమణదీక్షితులు తిరిగి ప్రధాన అర్చకులుగా నియమించాలన్నా... టీటీడీ రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలన్నా టిటిడి ముందు కొన్ని చిక్కులు ఉన్నాయి. గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన స్థానంలో ఆఘమేఘాల మీద కొత్తవారిని నియమించింది టీటీడీ. దీంతో ప్రస్తుతం ప్రధాన అర్చకుల స్థానాలు ఖాళీగా లేవు. ప్రస్తుతం గతంలో తొలగించిన అర్చకులను మళ్లీ తీసుకోవాలంటే ప్రస్తుతం విధుల్లో ఉన్నవారిని తొలగించడం లేదా ప్రధాన అర్చకుల సంఖ్యను పెంచడం చేయాలి.
 
ఇలా చేయడం వల్ల కొత్త రకాల ఇబ్బందులు వస్తాయన్నది టిటిడి భావన. రమణ దీక్షితులుతో పాటు తొలగించిన ఇతర ప్రధాన అర్చకులను కూడా తిరిగి నియమించాలి. ఈ కారణం వల్లనే రమణదీక్షితులును గౌరవ ప్రధాన అర్చకులుగా, ఆగమ సలహాదారుగా నియమించారు. కానీ రమణదీక్షితులు మాత్రం అందుకు సంతృప్తిగా లేరు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రమణదీక్షితుల వ్యవహారంపై ప్రభుత్వం, టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. మరోవైపు రమణదీక్షితులను గౌరవ ప్రధాన అర్చకుల పదవి నుంచి తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు