తితిదే దర్శన టిక్కెట్లు ఇచ్చినా తిరుమలకు రాని భక్తులు, ఎందుకని?

గురువారం, 16 జులై 2020 (17:53 IST)
కరోనా వైరస్ ఒకవైపు వ్యాపిస్తోంది. తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గిపోతోంది. నిన్నటికి నిన్న కేవలం 5 వేల మంది మాత్రమే స్వామివారిని దర్సించుకున్నారు. సాధారణంగా 12 వేల మంది దర్సించుకునేందుకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ లోను టిటిడి టిక్కెట్లను ఇచ్చింది.
 
కానీ టిక్కెట్లు పొందిన భక్తులు తిరుమలకు రాలేదు. అందుకు కారణం అర్చకులు, టిటిడి ఉద్యోగస్తులకు కరోనా సోకడమే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆసక్తికర ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఆణివార ఆస్థానాన్ని నిర్వహించినట్లే బ్రహ్మోత్సవాలను వైభోపేతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
 
వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో దర్శనాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. రమణదీక్షితుల ట్వీట్ పైన తీవ్రస్థాయిలో స్పందించారు టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.విసుబ్బారెడ్డి. రమణదీక్షితులు ఇలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.
 
బోర్డుకు సలహాలు ఇవ్వాలే గానీ ట్వీట్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. టిటిడి దర్సనం విషయంలో రాజకీయ రంగులు పులమొద్దన్నారు. అర్చకులకు ఇబ్బంది రాకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేసిన ఛైర్మన్ వారి కోసం దర్సనాలు ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
 
అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామివారి కైంకర్యాలు జరుగుతాయన్నారు ఛైర్మన్. టిటిడిలో ఇప్పటివరకు 140 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఎపి ఎస్పీలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి పోటు కార్మికులకు అధిక సంఖ్యలో కరోనా నిర్థారణ అయ్యిందన్నారు. 70 మంది ఇప్పటివరకు కోలుకున్నారని, వారిలో కొందరు హోం క్వారంటైన్లో ఉన్నారని, మరికొందరు డ్యూటీలకు వస్తున్నారని చెప్పారు.
 
చికిత్స పొందుతున్న 70 మంది కోలుకుంటున్నారని.. ఒక్కరు మాత్రమే ఐసియులో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. అర్చకుల సూచనలు అమలు చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 60 యేళ్ల పైబడిన వారికి సెలవు, హోం క్వారంటైన్ ఇవ్వాలని అర్చకులు కోరినట్లు టిటిడి ఛైర్మన్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు