టిడిపి సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. వంశీ నెక్ట్స్ ప్లానేంటి.. కొంతమంది వైసిపిలో చేరుతారంటే మరికొందరు అస్సలు రాజకీయాల్లోనే ఉండరన్న ప్రచారం జరుగుతోంది. అసలు వల్లభనేని వంశీ పక్కా ప్లాన్‌తోనే ప్రస్తుతం ఉన్నారని.. ఆయన త్వరలోనే రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారిన విషయం తెలిసిందే. టిడిపిలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాస్త పార్టీని వదిలేయడం ఆ పార్టీలో చర్చకు దారితీసింది. వంశీ పార్టీకి రాజీనామా చేయకముందు మొదటగా బిజెపి నేత సుజనా చౌదరిని కలిశారు. ఆ తరువాత రెండుమూడు గంటల వ్యవధిలో ఎపి సిఎంను కలిశారు. ఇక ఏముంది ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం బాగానే జరిగింది.
అయితే అనూహ్యంగా వంశీ పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసేశారు. అయితే వంశీ ఒక పక్కా స్కెచ్‌తోనే ఉన్నారంటున్నారు విశ్లేషకులు. వైసిపి నేతల నుంచి హెచ్చరికలు ఎక్కువయ్యాయని అందుకే తాను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పాడు వంశీ. ఆ తరువాత మీడియాకు కానీ, అనుచరులకు కానీ కనిపించకుండాపోయారు.
పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా ఉండేది వంశీ, వెంకట్రావుల పరిస్థితి. అందుకే వైసిపి పార్టీలోకి వంశీ రావడాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు వెంకట్రావు... ఆయన అనుచరులు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకట్రావును శాంతింపజేయడమే కాకుండా రాజకీయాలకే దూరంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది వంశీ ఆలోచన. అందుకే ఆయన పక్కా ప్రణాళికతోనే ఇదంతా చేస్తారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.