జగన్ చెంతకే వల్లభనేని వంశీ... అడ్డుతగులుతున్న యార్లగడ్డ

మంగళవారం, 29 అక్టోబరు 2019 (13:55 IST)
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జగన్ చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీజేపీలో చేరుతారా? లేదా? వైకాపా తీర్థం పుచ్చుకుంటారా అనే అంశంపై సందిగ్ధత వుండేది. అయితే, ఆయన వైకాపాలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
 
వచ్చే నెల మూడో తేదీన జరిగే ఓ కార్యక్రమంలో వల్లభనేని వంశీ వైకాపాలో చేరుతారని తెలుస్తోంది. ఆయనకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించి, వైకాపా కండువా కప్పుతారని సమాచారం. ఒకవైపు ఆయన పార్టీ మార్పును నిలువరించేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నా వంశీ మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.
 
అదేసమయంలో వల్లభనేని వంశీ రాకను కూడా గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన మనసులోని మాటను ఇప్పటికే జగన్‌కు చెప్పేందుకు ప్రయత్నించినా, సీఎం అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. 
 
కానీ యార్లగడ్డ మాత్రం సోమవారం జగన్ నివాసానికి వెళ్లి చాలాసేపు నిరీక్షించారు. అయినప్పటికీ జగన్ కనికరించలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశతో తిరిగివెళ్లారు. మరోవైపు, వంశీ రాజీనామా చేసిన తర్వాతనే వైసీపీలోకి వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో ఉప ఎన్నికలు వస్తే, స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీకి దిగాలని యార్లగడ్డ భావిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు