పవన్ పరుగులు పెట్టిస్తున్నారా? జగన్ ప్రకటన వెనుక అదేనా కారణం?

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (19:08 IST)
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏమిటన్నది తెలిపేందుకు మేథావుల కమిటీ ఏర్పడాలన్నదే తడవుగా వరుసగా జయప్రకాశ్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇంకా మరికొందరు సీనియర్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందనీ, దీనికి అంతా కలిసి ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రమంగా రాజకీయంగా ముందుకు కదులుతుండటంతో వైసీపీ కూడా తనదైన వ్యూహాలను రచిస్తోంది. తాజాగా జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ.
 
ఆయన ఏం చెప్పారంటే... ఏపీకి ప్రత్యేక హోదాపై మార్చి 5 నుంచి పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తామని తెలిపారు. ఒకవేళ అప్పటికీ కేంద్రంలో కదలిక రాకపోతే మటుకు బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజైన ఏప్రిల్ 6న తమ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని సంచలన ప్రకటన చేశారు. గతంలో ఒకసారి ఎంపీలతో రాజీనామా చేయిస్తామని చెప్పినప్పటికీ అప్పటి పరిస్థితుల వల్ల మిన్నకున్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా వైసీపి ఎంపీలు రాజీనామా చేయడం దాదాపు ఖరారు అయ్యే పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం జగన్ కనిగిరిలో ముఖ్య నేతలతో సుమారు 3 గంటల భేటీ తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 
 
వాటిలో మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడించడం, ఆ తర్వాత 3న ఢిల్లీకి పయనం, 5న జంతర్‌మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టాలన్నవి ప్రధానమైనవి. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ ఒకవైపు వేగంగా ముందుకు సాగుతుండటంతో ప్రతపక్ష పార్టీ కూడా అంతకంటే వేగంగా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. చూడాలి... వచ్చే 2019 ఎన్నికల నాటికి ఏ పార్టీ వెంట జనం అడుగులు వేస్తారో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు