చెవిరెడ్డి, కరుణాకర్‌ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు...?!

మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (19:30 IST)
ఒకరేమో సీనియర్‌ లీడర్‌, మరొకరు అంతకుమించి సీనియర్‌ లీడర్‌ అయితే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే అధినేతకు ఇద్దరూ సన్నిహితులే. ఇద్దరు రెండుకళ్ళు లాంటి వారు. అందుకే వీరిద్దరి మధ్య పొసగకపోయినా అధినేత మాత్రం ఇద్దరినీ పార్టీలో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతకీ వీరెవరంటారా... అదేనండి... చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మరొకరు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి. వీరి మధ్య వైరం ఇప్పటిది కాదు. కాంగ్రెస్‌ పార్టీ నుంచే ఉందని చెపుతుంటారు.. అదెలాగంటారా...?
 
దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి అత్యంత సన్నిహితులు భూమన కరుణాకర్‌ రెడ్డి. అలాగే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా వైఎస్‌ఆర్‌కు కాకుండా ఆయన కుమారుడు జగన్‌కు మాంచి సన్నిహితులు. అందుకే కాంగ్రెస్‌ హయాంలో తితిదే బోర్డు సభ్యులుగా జగన్‌ దగ్గరుండి మరీ ఆ పదవిని తీసిచ్చారు. స్థానికంగా ఉన్న సీనియర్‌ నాయకుడిని తనకు తెలియకుండా తితిదే సీటును చెవిరెడ్డికి ఇవ్వడంపై కరుణాకర్‌ రెడ్డి ఎప్పటి నుండో గుర్రుగా ఉన్నారు. అంతేకాదు మిగిలిన పార్టీ విషయాల్లోను చెవిరెడ్డి ముందుకెళుతుండటం, మిగిలిన పార్టీ నేతలను కలుపుకుని వెళ్ళడం ఏ మాత్రం భూమనకు ఇష్టం లేదు.
 
ఇద్దరి మధ్య అధికారపక్ష నేతకు, ప్రతిపక్షనేతకు మధ్య గొడవకు జరిగే విధంగా ఎప్పుడూ అదే పరిస్థితి. కానీ ఇద్దరు ఒకే పార్టీనే. కాంగ్రెస్‌ పార్టీ కనిపించకుండా పోయిన తరువాత ఇద్దరు జగన్‌ గూటికి చేరారు. అయితే చంద్రగిరి నుంచి పోటీలో దిగిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ భూమన మాత్రం గెలుపొందలేకపోయాడు. ఇక్కడ వీరికి సీట్లు ఇవ్వడం గెలుపొందడం బాగానే ఉన్నా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎవరికి సీట్లివ్వాలి అనే విషయం తనతో మాట్లాడిన తరువాత ఇవ్వాలన్నది భూమన అభిప్రాయం. ఎప్పటి నుంచో తాను చెప్పినట్లు అధినేత జగన్‌ వింటాడని భూమన భావించేవాడు.
 
అయితే గత ఎన్నికల్లో చెవిరెడ్డికి సీటు ఇవ్వకుండా చేయాలని భావించారు. అయితే చెవిరెడ్డి మాత్రం ముందుగానే బిఫాం తెచ్చుకుని రంగంలోకి దిగి గెలిచేశారు. అంతే కాదు తిరుపతిలోని తన అనుచరులు, పార్టీ కార్యకర్తలను కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసేవారు చెవిరెడ్డి. దీంతో ఇద్దరి మధ్య వైరం మరింత పెరిగింది.
 
అయితే తుని సంఘటనలో కరుణాకర్‌ రెడ్డి సీఐడీ విచారించిన సమయంలో చెవిరెడ్డి కూడా అక్కడికి రావడం భూమనకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రతిచోటా కూడా చెవిరెడ్డి ఉండటంతో భూమనను ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. చెవిరెడ్డిని ఇక్కడి నుంచి వెళ్ళిపొమ్మని కూడా తన అనుచరులతో సంకేతాలు కూడా పంపారట. అయితే చెవిరెడ్డికి ముందు నుంచి పబ్లిసిటీపై కాస్త ఆతృత ఎక్కువగా ఉండటంతో పాటు కరుణాకర్‌ రెడ్డి విచారణ గురించి తెలుసుకుందామనే కుతూహలంతో వెళ్లినట్లు చెప్పుకున్నారు.
 
భూమన కరుణాకర్‌రెడ్డి ఎంత చెప్పేందుకు ప్రయత్నించినా చెవిరెడ్డితో మాత్రం మార్పు రాలేదు. దీంతో చెవిరెడ్డిపై మరింత ఆగ్రహంతో భూమన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి మధ్య వైరం మరింత పెరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరు సీనియర్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరకముందే అధినేత కలుగజేసుకోవాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి నాయకుల మనస్పర్థలు కూర్చోబెట్టి తీరుస్తారో లేదో...?

వెబ్దునియా పై చదవండి