దీపావళి పండుగ రావడానికి కారణాలున్నాయి. ఎన్నో కథలు ప్రాచుర్యంలో వున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతాలలో దీపావళి పండుగకు సంబంధించిన కథలు వున్నాయి. రామాయణంలో అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన పదితలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళతాడు. ఆ తర్వాత రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు.
ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతుంది.