చిరంజీవి పొలిటికల్ కెరీర్ ఇప్పుడే స్టార్టయిందా...? సీమాంధ్ర సీఎం కుర్చీ ఎప్పటికో...?

శనివారం, 22 మార్చి 2014 (20:00 IST)
FILE
సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రధసారథిగా కీలక భాద్యతలు భుజానికెత్తుకున్న కేంద్రమంత్రి చిరంజీవి గురించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఛలోక్తులు విసిరారు. కిరణ్ ఏమన్నారంటే, చిరంజీవి మంచి నటుడే, అయితే ఇప్పుడు ప్రచారంలో మాత్రం ఓ కామెడీ నటుడిగా మారిపోయాడని అన్నారు. అంతేకాదు చిరంజీవికి సరైన రాజకీయ అవగాహనా లేదనీ, అందువల్ల అసందర్భంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చిరంజీవి గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రాలో బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి సినీ ఎంట్రీ సమయంలోనూ అచ్చం ఇలాంటి అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారని చాలామంది సినీ సీనియర్లు చెపుతుంటారు. షూటింగ్ సమయాల్లో చిరంజీవిని చులకన చేసి కొందరు మాట్లాడేవారని అంటారు. కానీ ఏనాడూ వాటిని చిరంజీవి బయటి ప్రపంచానికి తెలియనీయలేదు. అలాగని తనను హీనంగా చూసినవారిని కూడా ఆ తర్వాత మన్నించి వదిలేశారంటారు.

అలా సినిమా పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఎన్నో కష్టాలు పడిన చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు వంటి హేమాహేమీల మధ్య తన బండిని నెట్టుకుంటూ ముందుకు కదిలారు. ఆ సమయంలోనే అందరికంటే భిన్నంగా చేయాలన్న తపన చిరంజీవికి డ్యాన్స్ పై మక్కువ పెంచింది. దీనికీ ఓ కారణం ఉంది.

ఓ సందర్భంలో చిరంజీవి కూడా ఓ విషయం ఒప్పుకున్నారని అంటారు. అక్కినేని, సీనియర్ ఎన్టీఆర్ అంతటి అందగాడిని కాని తను ఎలాగైనా గుర్తింపు సాధించాలన్న పట్టుదలతో డ్యాన్సులను ప్రాక్టీస్ చేస్తూ ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టించారు. అలా మెగాస్టార్‌గా వెండితెరపై వెలిగిపోయారు.
నిరంతర శ్రమజీవి చిరంజీవి సిల్వర్ స్క్రీన్ సక్సెస్...
ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు వంటి హేమాహేమీల మధ్య తన బండిని నెట్టుకుంటూ ముందుకు కదిలారు. ఆ సమయంలోనే అందరికంటే భిన్నంగా చేయాలన్న తపన చిరంజీవికి డ్యాన్స్ పై మక్కువ పెంచింది.


అలాంటి మెగాస్టార్ ప్రజారాజ్యం పొలిటికల్ పార్టీతో ఎంట్రీ ఇచ్చుకున్నా, ఆ తర్వాత తన ఓటమిని ఒప్పుకుని ప్రజలు పట్టంకట్టిన కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు. ఇపుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఇక్కడ నుంచే ఆయన అసలైన పొలిటికల్ కెరీర్ స్టార్టయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమయిపోయిందని అందరూ అంటున్నా తనదైన స్టయిల్లో ధైర్యంగా బస్సు యాత్రలు మొదలెట్టిన చిరంజీవిని ప్రత్యర్థులు విమర్శిస్తుంటే అలనాటి సినీ కెరీర్ ప్రారంభంలో కొంతమంది చేసిన వెక్కిరింపులు గుర్తుకువచ్చి ఉండవచ్చు.

మొత్తమ్మీద చిరంజీవి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని వెళుతున్నారు. మరి 2014 ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి