తమ్ముడు పవన్ నిలబెట్టిన అభ్యర్థుల్ని ఓడిస్తా... చిరంజీవి వ్యాఖ్య
శుక్రవారం, 21 మార్చి 2014 (20:40 IST)
WD
చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే అభ్యర్థులను ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని ప్రకటించారు. మీ తమ్ముడు నరేంద్ర మోడీని కలిశారు కదా అని ప్రశ్నిస్తే... దానిదేముంది. ఎవరి ఇష్టం వారిది. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలిస్తే అందులో తప్పేముందని అన్నారు.
బహిరంగ సభ ముగించుకున్న అనంతరం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపే తమ్ముడు పవన్ కల్యాణ్ సహా అంతా తనకు రాజకీయ ప్రత్యర్థులేనని చిరు తెలిపారు. తమ్ముడు పవన్ కల్యాణ్ కు గట్టిపోటీ ఇస్తామని ఆయన తెలిపారు. పవన్ ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెడతాడో అక్కడ గట్టి అభ్యర్థులను బరిలోకి దించుతామని చిరంజీవి ప్రకటించారు. రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డే కారణమని చిరు ఆరోపించారు.