పడిపోతున్న జగన్ క్రేజ్.... పెరుగుతున్న పవన్ క్రేజ్... ఎందుకు?

మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (20:16 IST)
File
FILE
మొన్నటివరకూ జగనిజం అంటే జనం ఎగబడ్డారు. కానీ ఇప్పుడు పవనిజం వైపు మెల్లంగా జనం జరుగుతున్నారా.... అంటే అవుననే అంటున్నారు. రాష్ట్ర విభజనకు మూల కారకుడయిన కేసీఆర్ ను జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకూ పల్లెత్తు మాట అనలేదు. కేసీఆర్ నాలుకలు కోసేస్తా... హైదరాబాద్ నుంచి తరిమేస్తా అన్నప్పటికీ ఎంతమాత్రం స్పందించలేదు. కానీ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ అమాంతం నేరుగా కేసీఆర్ పై టార్గెట్ పెట్టారు.

కేసీఆర్ భాష సరిచేసుకోవాలంటూ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన స్వరాన్ని మరింత రాటు దేల్చాడు. దేశంలో తొలిసారిగా బీసీ వర్గం నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి పీఎం కాబోతుంటే మోడీ లేడు గీడీ లేడంటావా అంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఏకంగా వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో మోడీని ఏమయినా పరుష పదజాలంతో దూషిస్తే తాట తీస్తా అంటూ హెచ్చరిక చేసి వార్తల్లోకి ఎక్కాడు. అంతేకాదు సీమాంధ్రులు తెలంగాణలో పోటీ చేయరాదంటూ కేసీఆర్ చెప్పడానికి ఆయనెవరు అంటూ మండిపడ్డారు. దాంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు పవన్ కళ్యాణ్.

కేసీఆర్ తెలంగాణ రాకమునుపు ఏ రేంజిలో సీమాంధ్ర నాయకులపై ధ్వజమెత్తారో ఇపుడు పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో మాటల దాడికి దిగుతున్నారు. మొత్తమ్మీద తెలంగాణలో కేసీఆర్ మాటల యుద్ధానికి తగిన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఈ స్థాయిలో కేసీఆర్ ను ఎందుకు టార్గెట్ చేయలేదన్న చర్చ నడుస్తోంది. సీమాంధ్రుల వ్యవహారంలోనే కాదు తెలంగాణ అంటే ప్రాణం అంటూ పవన్ కళ్యాణ్ సూటిగా ప్రజల్లోకి వెళుతున్న రీతిలో జగన్ ముందుకు పోలేదన్న వాదనలు వినబడుతున్నాయి. చూడాలి ఎవరి క్రేజ్ ఎంతో మరి.

వెబ్దునియా పై చదవండి