ఆగస్టు 18 హయగ్రీవ జయంతి... రోజంతా ఉప్పులేని ఆహారం తింటే...?

బుధవారం, 17 ఆగస్టు 2016 (18:30 IST)
శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమయే ‘హయగ్రీవ జయంతి’. హయగ్రీవుడనగానే సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించి, గుఱ్ఱపు మోముగల ఒక వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి. ఆ అవతారాలలో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. ‘హయం’ అనగా గుఱ్ఱం, ‘గ్రీవం’ అనగా కంఠం. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం.
 
రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా అర్చించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. 
 
శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతోపాటు సకల దేవతలు సంపూర్ణ శుభాశీస్సులు కూడా సంప్రాప్తమవుతాయి. ఈ క్రింది స్తోత్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి. 
 
“జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే”
 
వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు. విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి. లౌకిక, పరలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన ఫలకరం. హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి. హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. మరియు తెల్లపూవులతో పూజించాలి. మరీ ఎక్కువ వాసన కలిగించే పుష్పాలతో పూజించకూడదు. 
 
ఇలా శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది. సకలైశ్వర్యాలను కలిగించే హయగ్రీవ పూజ చేయడానికి స్త్రీ పురుష తారతమ్యం లేదు. కానీ ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి. హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

-డాక్టర్ కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి

వెబ్దునియా పై చదవండి