రేపే 'గురు పౌర్ణమి'... ఈ పుణ్యదినాన ఆచరించాల్సిన పూజ...

సోమవారం, 18 జులై 2016 (13:06 IST)
వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో పూజలు జరుగుతాయి. కొత్త అంగ వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలు ఉంచాలి. ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం. పూజ అయిన తర్వాత తలా ఓ పిడికెడు బియ్యం తీసుకుని తమ ఇళ్ళలోని బియ్యంలో కలుపుకుంటారు. 
 
బియ్యం, కొత్త వస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని, నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచకాలని పురోహితులు అంటున్నారు. అందుచేత గురుపౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుటన పెట్టి దేవతా స్తుతి చేయాలి గురుపౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతా స్తుతి చేయకూడదని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవునేతితో దీపమెలిగించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. 
 
అలాగే ఆలయాల్లో జరిగే పూజలను కళ్లారా వీక్షించేవారికి లేదా పూజలు జరిపేంచేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. గురుపౌర్ణమి రోజున వస్త్రదానము చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాసమహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గురుపౌర్ణమి నాడు (ఆషాఢ శుద్ధ పౌర్ణమి) గురుపూజ చేసే వారికి శుభఫలితాలుంటాయి. అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
 
వ్యాస పూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. 
 
పూజకు పసుపు రంగు అక్షితలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్‌, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి. గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలి. తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులిచ్చుకోవాలి. పూజకుముందు సాయిబాబా, దత్త స్తోత్రములు, గురుదత్త శ్రీసాయిసచ్చరిత్రలతో ధ్యానించాలి. లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి అలాగే గురుపౌర్ణమి రోజున శ్రీసాయి, శ్రీదత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి, గాణాగాపూర్‌ల సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది. 
 
అలాగే వ్యాసపూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. గురుపౌర్ణమి మహోత్సవాలు, సామూహికంగా శ్రీసాయిసత్యవ్రతం వంటి పూజలు చేయించాలి. అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిచ్చరిత్ర వంటి పుస్త్తకాలతోసహా... ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి