వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం సమావేశమయ్యారు. దాదాపు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపిన బుధవారం విడుదలైన వల్లభనేని వంశీ.. జైలు నుంచి విడుదలైన మరుసటిరోజే జగన్‌ను కలుసుకున్నారు.
తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వచ్చిన వంశీ... తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. జైలులో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురైనట్టు సమాచారం.
కాగా, కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వైకాపా నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే, వంశీపై ఏకంగా 11 కేసులు నమోదు చేసి జైలుపాలు చేశారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా, వంశీకి గుడివాడ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 140 రోజుల తర్వాత విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన విడుదలకు మార్గం ఏర్పాటైంది.