Refresh

This website p-telugu.webdunia.com/article/festivals/why-women-to-perform-varalakshmi-vratas-121081900090_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

స్త్రీలు వరలక్ష్మి వ్రతాలు చేయవలసిన అవసరం ఏంటి?

గురువారం, 19 ఆగస్టు 2021 (23:37 IST)
స్త్రీలలో ఉన్న సహజమైన వైభవాన్ని ఆవిష్కరించేది ఈ వరలక్ష్మీ వ్రతం. మనం సాంప్రదాయ స్త్రీ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే బాల్యం నుంచి విశేషమైన లక్షణాలు ఆమెలో కనిపిస్తాయి. స్త్రీ వివాహానికి ముందు ఇంట్లో తల్లికి సాయంగా వంటపని, ఇంటిపనుల్లో సాయం చేస్తూ ఊరటగా ఉంటుంది.
 
అదే అమ్మాయి తండ్రి మనసును అర్థం చేసుకుంటూ ఆయన మానసిక స్థితిగతులను గమనిస్తూ ఆయన ఎదుర్కునే కష్టాల బరువు తెలియకుండా కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, శాంతిని సృష్టిస్తుంది. చాలామంది ఇళ్లలో ఒక అనుభవం ఉంటుంది. అమ్మాయికి పెళ్లి చేసి పంపిన తర్వాత ఆ ఇంటికి ఏదో లక్ష్మీ కళ పోయినట్టు తెలుస్తుంది. కొందరికి భౌతికంగా కూడా ఆ విషయం అవగాహనలోకి వస్తుంది. అంటే స్త్రీ సాక్షాత్తూ లక్ష్మీదేవి అని మనకు అర్థమవుతుంది.
 
వివాహ తంతులో అమ్మాయిని తామరపువ్వు లాంటి బుట్టలో కూర్చోబెట్టి లక్ష్మీదేవిగా ఆవాహన చేసి వరుడిని విష్ణుమూర్తిగా చేసి పాదాలు కడిగి ఈ ఇంటి లక్ష్మీదేవిని ఆ ఇంటికి పంపుతాం. అలాగే లక్ష్మీ స్థానాలుగా చెప్పబడిన ఐదింటిలో స్త్రీ పాపిట కూడా చెప్పబడింది. ఈ పూర్తి విషయాన్ని గమనిస్తే స్త్రీ అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం అవగాహన చేసుకోవచ్చు. మరి తానే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమై ఉండి స్త్రీ ఈ వరలక్ష్మి వ్రతాలు చేయవలసిన అవసరం ఏంటి? అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
 
స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేయడంలో పరమాద్భుతమైన రహస్యం దాగి ఉంది. మనం పైన పరిశీలించిన స్త్రీ లక్షణంలో ఎక్కడా ఆమె తన కోసం తాను చేసిన క్రతువు లేదు. బాల్యంలో కుటుంబంలో శాంతిసౌఖ్యాలను ప్రసాదించగా, పెళ్లికి ముందు వేదయుక్తమైన, ధర్మయుతమైన భర్త లభించి ఆయన ద్వారా లోకానికి మేలు చేయాలనే సంకల్పంతోనే వివాహానికి ముందు మంచి భర్త కోసం చేసే నోములు ఉన్నాయి. అలాగే వివాహానంతరం ఆమె చేసే వ్రతాలు, పూజలు అత్తవారింటి అభివృద్ధికి, వంశాభివృద్ధికి, భర్త, పిల్లల యోగక్షేమాల కోసం ఉంటాయి. 
 
స్త్రీ వల్లే పురుషులు పితృ రుణాన్ని తీర్చుకుని ఆత్మాభివృద్ధిని పొందుతున్నాడు. ఈ పూర్తి ప్రయాణంలో స్త్రీ తన స్వార్థం కోసం చేసిన ఏ క్రతువు మనకు కనబడదు. చాలామంది గమనించని మరో విషయం ఏంటంటే శ్రావణమాసంలో చేస్తున్న వరలక్ష్మీ వ్రతం కూడా కేవలం ఆమె తన కుటుంబం కోసం మాత్రమే కాదు... తను లక్ష్మీ దేవియై ఇతర ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి తాంబూలాది సత్కారాలను చేసి ఎదుటి స్త్రీలలో ఉన్న లక్ష్మీతత్వాన్ని ఆవిష్కరించడమే వరలక్ష్మీ వ్రతం ఉద్దేశం.
 
ఈ వ్రతం ద్వారా తన ఇల్లే కాదు. సమాజమంతా అష్టైశ్వర్యాలతో తులతూగేలా స్త్రీ తన దివ్యత్వాన్ని చాటుకుంటుంది. సమాజంలో మనుష్య ఉపాధిని పొందిన ఎవరైనా కేవలం తన కోసం తాను బతకడమే కాకుండా కుటుంబం కోసం సమాజం కోసం పాటు పడాలని సందేశమిస్తుంది స్త్రీ జీవితం.శ్రావణ మాసంలో ప్రతీ స్త్రీలోనూ అమ్మవారి సర్వశక్తులు ప్రచండస్థాయిలో దేదీప్యమానంగా వెలుగొందుతాయి. 
 
ఆరోజు స్త్రీ కుటుంబం కోసం చేసే ఈ వరలక్ష్మీ వ్రతంలో అష్టలక్ష్ములూ చేరి అష్టైశ్వర్యాలను పొందేలా అనుగ్రహిస్తారు. ప్రతి స్త్రీ తన కుటుంబం కోసం ఈ వ్రతం ఆచరించగలిగితే సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే కుటుంబమే సమాజం అనే విషయం మనందరికీ తెలిసిందే! సనాతన ధర్మం ఏది చేసిన వ్యక్తిగత, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొనే చేస్తుందనడానికి తార్కాణమే వరలక్ష్మీ వ్రతం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు