కాబుల్ వీధుల్లో నలుగురు అఫ్గాన్ మహిళలు చేతితో రాసిన కొన్ని కాగితాలను ప్రదర్శిస్తూ కనిపించారు. 'ఇన్ని సంవత్సరాలుగా మేం సాధించిన విజయాలు, మేం దక్కించుకున్న కనీస హక్కులు వృథాగా పోకూడదు' అంటూ వారు నినదిస్తున్నారు. వారు నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో తాలిబన్లు వారిని చుట్టుముట్టి ఉండటం గమనార్హం. అయినా, వారి మొహంలో భయమేమీ కనిపించడం లేదు.
ఈ వీడియోను ఇరాన్‌కు చెందిన పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త షేర్ చేశారు. 'గుండె నిండా ధైర్యం నింపుకున్న ఈ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా కాబుల్ వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నిలబడ్డారు. వారికి అండగా మరికొంత మహిళలు, పురుషులు జత కలుస్తారని ఆశిస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు.