అనేక వాహనుడు

శుక్రవారం, 14 సెప్టెంబరు 2007 (13:47 IST)
WD PhotoWD
గణపతి వాహనం ఎలుక. కానీ స్వామివారికి సింహం, నెమలి, సర్పం కూడా వాహనాలే అని ముద్గలపురాణం చెబుతోంది. మత్సరాసురుడనే రాక్షసుని సంహార నిమిత్తం వక్రతుండావతారం దాల్చిన సమయంలో స్వామికి సింహం వాహనమైంది. కామాసుర సంహారం నిమిత్తం వికటావతారమెత్తినపుడు నెమలి గణపతికి వాహనమైంది. నెమలి కామానికి, గర్వానికి, అహంకారానికి ప్రతీకగా చెప్పబడింది. విశేష ప్రచారంలో ఉన్న వాహనం ఎలుక. దీనిని అఖువు అని, మూషికం అని పిలుస్తారు.

ఎలుక క్రోధ, లోభ, మోహ, మద దురభిమానాలకు ప్రతీకగా చెప్పబడింది. అంతేకాక ఎలుక తమోగుణ రజోగుణాలకు విధ్వంసకారక శక్తికి సంకేతం. మూషికుడనే రాక్షసుడు విఘ్నేశ్వరునితో యుద్ధంలో ఓడి శరణుజొచ్చగా గణపతి మూషికాన్ని వాహనంగా స్వీకరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. రైతులు గణపతిని ధాన్యధి దేవతగాను, గ్రామ్య దేవతగాను పూజిస్తారు. ఎలుక పంటలను నాశనం చేస్తుంది. వినాయకుని వాహనం ఎలుక అయినపుడు అది స్వామి అధీనంలో ఉంటుంది. కనుక రైతులు మూషికవాహనుని ఆరాధిస్తారు.

గణేశుడు పరబ్రహ్మకు ప్రతీక. `గ` జ్ఞానార్థవాచకం, `ణ` నిర్వణ వాచకం. ఈ గ, ణ, రెండింటికీ ఈశుడైన పరబ్రహ్మే గణేశుడు.

జ్ఞానార్థ వాచకో గశ్చణశ్చ నిర్వణ వాచకం
తయోరీశం పరం బ్రహ్మ గణేశం......

వినాయకుని తొండం ఓంకారానికి, ఏకదంతం పరబ్రహ్మకి, చేటలాఉండే చెవులు మంచి విషయాలు విని చెడు విషయాలను వదిలేయాలని సూచిస్తాయి. గణేశుని ఉదరం స్థిరత్వానికి చిహ్నం. హస్తాల్లోని పాశం రాగానికీ, అంకుశం క్రోధానికీ గుర్తు. అవి ఆయన అధీనంలో ఉంటాయి. అభయహస్తం భక్తుల రక్షణ కవచం. మణకహస్తంలో మోదకం ఆనందానికి ప్రతీక. పరమానందాన్ని ప్రసాదిస్తాడు గణపతి.

వెబ్దునియా పై చదవండి