జాతి వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు, నల్లజాతి సూరీడుగా పేరెన్నికగన్న నెల్సన్ మండేలా... లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో 70వ జన్మదిన వేడుకలను జరుపుకున్న రోజును చరిత్రలో జూన్ 11వతేదీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాలపాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించిన మండేలా, 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన, జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు ఒక సంకేతంలాగా నిలిచారు.
జీవిత వివరాలను చూస్తే... నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా, దక్షిణాఫ్రికా దేశ మాజీ అధ్యక్షుడు. కేప్ ప్రాంతంలోని ఉమటా జిల్లా, మవెజో అనే ఊర్లో 1918, జూలై 18వ తేదీన ఈయన జన్మించారు. దక్షిణాఫ్రికాకు పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడిగా ఈయన కీర్తి గడించారు. అధ్యక్షుడు కాకమునుపు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమకారుడిగా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడిగా పనిజేశారు.
జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో...!
జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా చాలాసార్లు వెల్లడించారు. భారత దేశం కూడా మండేలాను "జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతి"తో సత్కరించింది.
ఫిబ్రవరి 11, 1990లో జైలునుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశారు. తన పూర్వపు శత్రువులనుండి కూడా ప్రశంసలు అందుకొన్నారు. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు ఈయనను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను "మదిబా" అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో పిలుస్తుంటారు.
జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా చాలాసార్లు వెల్లడించారు. భారత దేశం కూడా మండేలాను "జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతి"తో సత్కరించింది.
అలాగే... 1990లో భారత ప్రభుత్వం మండేలాకు మనదేశపు అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నను ప్రకటించింది. మన దేశం నుంచి ఆయనకు ఎంతో గౌరవం లభించిందన్న దానికి నిదర్శనంగా అనేక విగ్రహాలు కూడా చాలాచోట్ల నెలకొల్పబడ్డాయి. కొన్ని కూడళ్ళకు, రోడ్లకు మండేలా పేరు పెట్టారు. ఢిల్లీలో కూడా ఆయన పేరుతో ఒక "నెల్సన్ మండేలా రోడ్" ఉంది.
అదలా ఉంచితే... 1994లో మండేలా తన 77 సంవత్సరాల వయసులో అధ్యక్ష పదవిని చేబట్టి ఆ పదవిని అలంకరించిన వారిలో అతి పెద్ద వయస్కుడయ్యారు. రెండవసారి మరలా ఎన్నికల్లో పోటీ చేయరాదని నిశ్చయించుకున్న ఆయన, 1999లో పదవీ విరమణ చేశారు. జూలై 2001లో ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, రేడియేషన్ వైద్యం చేశారు.
తన పదవీ విరమణ తరువాత ఎయిడ్స్ వ్యాధి నివారణకు మండేలా విశేషంగా కృషి చేశారు. ఆ తరువాత జూన్ 2004లో తాను రాజకీయ జీవితం నుండి విరమించుకుని, అధికంగా కుటుంబంతో గడపాలని అనుకుంటున్నట్లు మండేలా ప్రకటించారు. అయితే ఆయన పూర్తిగా సమాజం నుంచి దూరం కాలేదుగానీ, 2003 తరువాత తన సాంఘిక కార్యక్రమాలను బాగా తగ్గించుకున్నారంతే...!!