హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఒక నెల వ్యవధిలో, ఈ రెండు ఉత్తర పర్వత రాష్ట్రాలలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాలతో ఆకస్మిక వరదలు, ప్రాణాంతక కొండచరియలు విరిగిపడటంతో విషాదకరమైన రోడ్డు ప్రమాదాలకు దారితీసింది. జూన్ 1 నుండి ఉత్తరాఖండ్‌లో 70 మరణాలు నమోదయ్యాయని, ప్రకృతి వైపరీత్యాలలో 20 మంది మరణించారని, రోడ్డు ప్రమాదాలలో మరో 50 మంది మరణించారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ (SEOC) విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
ఉత్తరకాశీలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్, రుద్రప్రయాగ్‌లలో రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం.