సాలార్ జంగ్ మ్యూజియం ప్రధాన సేత మీర్ యూసుఫ్ అలీఖాన్ అని పిలువబడే మూడవ సాలార్ జంగ్ జన్మించిన రోజును... చరిత్రలో జూన్ 13వ తేదీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈయన 1889 జూన్ 13వ తేదీన జన్మించారు.
దాదాపు 40 వేల వరకూ అపురూపమైన సేకరణలతో అలరారుతున్న సాలార్ జంగ్ మ్యూజియం ఆవిర్భావానికి మూడవ సాలార్ జంగ్ ప్రధాన కారకులు. ఈయన నిజాంలకు ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. విశేషంగా దేశ ప్రజలందరినీ ఆకట్టుకున్న ఈ మ్యూజియంను 1961లో జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా ప్రభుత్వం ప్రకటించింది.
మన రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లోని మూసీనది దక్షిణ ఒడ్డున ఉండే "దార్-ఉల్-షిఫా" వద్ద సాలార్ జంగ్ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంను హైదరాబాద్‌ను పరిపాలించిన నిజాం పాలకులైన సాలార్ జంగ్ కుటుంబీకులు ప్రారంభించారు. ఈ కుటుంబంవారు ప్రపంచంలో పలు ప్రదేశాలనుంచి ఎన్నో విలువైన కళాఖండాలను, అపురూప వస్తువులను సేకరించి సాలార్ జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు.
నిజాం పాలకులు సేకరించిన అమూల్యమైన కళాఖండాలలో ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు, ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలు, నగిషీలు, యుద్ధ సామగ్రి, పర్షియా తివాసీలు మొదలైన అపురూపమైన వస్తువులను సేకరించి ఈ మ్యూజియంలో భద్రపరిచారు.
దాదాపు ఈ కళాఖండాలన్నింటినీ మూడవ సాలార్ జంగ్ సేకరించినవే అయినప్పటికీ... ఆయన తండ్రిగారైన మీర్ లయీఖ్ అలీ ఖాన్ (రెండవ సాలార్ జంగ్) మరియు నవాబ్ మీర్ తురాబ్ అలీఖాన్ (మొదటి సాలార్ జంగ్)లు కూడా మిగిలిన వాటిని సేకరించినట్లు తెలుస్తోంది.
సాలార్ జంగ్‌కు చెందిన నగరమహలులోని 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా... పరదాలో ఉన్న "రెబెక్కా", జహాంగీర్ చురకత్తి, నూర్జహాను పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవిగా చెప్పవచ్చు.
సాలార్ జంగ్ ఇతర సేకరణల్లోని గ్రంథాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండీ తెప్పించి భద్రపరచబడినవి. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఈ మ్యూజియంను భారత పార్లమెంటు "జాతీయ ప్రాముఖ్యం" కలిగినది గుర్తించింది.
సాలార్ జంగ్ మ్యూజియంను భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 డిసెంబర్ 16 నుంచి ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచుతున్నారు. అందులో భాగంగా.. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మ్యూజియం సందర్శకుల కోసం తెరవబడి ఉంటుంది. అయితే శుక్రవారం రోజును సెలవుదినంగా పాటిస్తున్నారు.