"తిన్నమ్మకు తినబెడితే... నూనె పెట్టినట్టే" అంటే...?
"తిన్నమ్మకు తినబెడితే... బోడి తలకు నూనె పెట్టినట్టే" అనేది ఒక జాతీయం. ఆపదలలో ఉన్న పేదవారికి సహాయం చేసినట్లయితే ఫలవంతం అవుతుంది. కానీ ఉన్నవారికే ఇంకా ఇంకా అమర్చి పెట్టినట్లయితే, దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండకపోగా, అంతా వ్యర్థమే అవుతుందని చెప్పేందుకు.. ఈ జాతీయాన్ని పోలికగా వాడుతారు.
బాగా కడుపునిండా తిన్నవారికి, ఎలాంటి ఆకలీ లేనివారికి మంచి మంచి ఆహార పదార్థాలను తినమని ఇచ్చినట్లయితే... వాటిని ఎంగిలి చేసి వృధా చేస్తారు తప్ప, వాటిని పూర్తిగా తినలేరు. అదే బాగా ఆకలితో ఉన్నవారికి ఎలాంటి ఆహారాన్ని ఇచ్చినా సరే తృప్తిగా, వృధా చేయకుండా భోంచేస్తారు.
తలనిండా జుట్టున్నవారికి నూనె పెట్టినట్లయితే ప్రయోజనం ఉంటుంది గానీ, బోడి తలకు నూనె పెడదామంటే అదంతా కారిపోయి వృధా అవుతుందే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ విషయాలను సూటిగా, ప్రజలకు వాడుకకు దగ్గరగా ఉండేలా మన పెద్దలు "తిన్నమ్మకు తినబెడితే, బోడి తలకు నూనె పెట్టినట్లు" అనే జాతీయాన్ని వెలుగులోకి తెచ్చారు.
ఈ జాతీయాన్నే రకరకాల సందర్భాలలో, ఆయా విషయాలకు అనుగుణంగా వాడుతుంటారు. ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే... ధనవంతులకు తప్ప, పేదవారికి ఎలాంటి మేలూ చేయకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నదానికి పోలికగా కూడా ఈ జాతీయాన్ని వాడుతుంటారు.