చక్కెర వ్యాధి. శరీరంలో చక్కెర హెచ్చుతగ్గుల వల్ల కలిగే అనారోగ్యాన్ని వ్యాధి అని అంటున్నా, నిజానికి ఇది వ్యాధి కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ డయాబెటిస్‌ను అదుపులో ఉంచగలిగితే మనిషి ఎంతకాలమైనా హాయిగా జీవించగలడు. మనం ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా అదనంగా ఉత్పత్తి అయిన చక్కెర కాలేయం (లివర్)లో నిల్వ ఉంటుంది.
మనం శారీరకంగా ఎక్కువ కష్టపడితే, కణాలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంటే ఎక్కువ చక్కెర (గ్లూకోజ్) కావాలన్నమాట. దీనిని లివర్ అందిస్తుంది. ఇదికాక ఇంకా అదనపు చక్కెర నిల్వ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇదే డయాబెటిస్! దీనివల్ల మూత్రపిండాల (కిడ్నీస్) పైన అధిక భారం పడుతుంది.
మన దేహంలోని పాంక్రియాస్ అనే అవయవం ఇన్‌సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాంక్రియాస్ జీర్ణకోశానికి పక్కనే ఉంటుంది. చక్కెరను జీర్ణం చేయడంలో పాంక్రియస్‌దే కీలకపాత్ర. చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వచేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ పాంక్రియస్ బాధ్యత.
వ్యాధి లక్షణాలు :
* త్వరగా అలసిపోవడం, నీరసం
* శరీరం నిస్సత్తువగా మారడం
* పనిలో ఆసక్తి లేకపోవడం
* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం
* తరచూ మూత్ర విసర్జన చేయడం
* ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం
* కంటి చూపు మందగించడం
* కీళ్ళనొప్పులు
* ఒంటినొప్పులు
* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం