సాధారణంగా కొబ్బరి నీళ్లతో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. వాటి నుండి ప్రధానంగా ఎన్నో మినరల్స్ మన శరీరానికి అందుతాయి. అదే విధంగా తేనె కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కూడా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి.
* కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమాన్ని రోజూ తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. గ్యాస్, కడుపులో మంట, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అల్సర్లు ఉంటే నయమవుతాయి.
* కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ కూడా సమృద్ధిగా ఉండడం వల్ల ఈ మిశ్రమం యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేస్తుంది. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. వయస్సు మీద పడడం కారణంగా వచ్చేటువంటి ముడతలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
* కిడ్నీలు శుభ్రమవుతాయి. శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటకి పోతాయి.
* కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమంలో ఔషధ గుణాలు అధికంగా ఉండడం వల్ల అది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పాటు అందిస్తుంది.