రూటు మార్చిన కరోనా.. ఈ మూడు లక్షణాలను తేలిగ్గా తీసుకోకండి!

శనివారం, 1 మే 2021 (15:38 IST)
కళ్లు ఎర్ర బడుతున్నాయా? చెవుల్లో రింగింగ్ సౌండ్ వినిపిస్తోందా? గ్యాస్ట్రిక్ సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే నిర్లక్ష్యం చేయకండి. కరోనా సోకి ఉండవచ్చు. గతేడాది తొలి దశలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం, శ్వాస సంబంధమైన సమస్యలను కరోనా లక్షణాలుగా గుర్తించారు.
 
ప్రస్తుతం విస్తరిస్తున్న రెండో దశలో పైన పేర్కొన్న వాటితో పాటు మరో మూడు కొత్త లక్షణాలను కూడా పరిశోధకులు ఈ జాబితాలోకి చేర్చారు. కళ్లు గులాబీ రంగులోకి మారడం, వినికిడి సమస్యలు, జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా కరోనా లక్షణాలుగానే పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. 
 
పింక్ ఐ
కళ్లు గులాబీ వర్ణంలోకి మారడం కూడా కరోనా లక్షణమేనని చైనాలో జరిగిన ఓ అధ్యయనం ద్వారా బయటపడింది. కళ్ల కలక, కళ్ల వాపు, కంటి నుంచి అదే పనిగా నీరు కారడం.. మొదలైన వాటిని కూడా కరోనా లక్షణాలుగానే గుర్తించాలని సదరు అధ్యయనం పేర్కొంది. చైనాలో రెండో దశలో ప్రతి 12 మందిలో ఒకరు కంటి సంబంధ సమస్యలతో బాధపడ్డారట. 
 
వినికిడి సమస్యలు
చెవిలో అదే పనిగా రింగింగ్ సౌండ్ వినిపించడం, వినికిడి సమస్యలు తలెత్తడం కూడా కరోనా లక్షణాలేనని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీ‌లో ప్రచురితమైన అధ్యయనం ధ్రువీకరించింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్.. వినికిడి సమస్యలకు కూడా కారణమవుతుందని సదరు అధ్యయనం స్పష్టం చేసింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు వినికిడి సమస్య ఎదుర్కొనే ప్రమాదం 7.6 శాతమని 24 అధ్యయనాలు పేర్కొన్నాయి. 
 
గ్యాస్ట్రో ఇంటెస్టినల్
జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా కరోనా లక్షణాల కిందకే వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, వికారం కూడా కరోనా లక్షణాలే. ఈ మధ్య కాలంలో తరచుగా ఉదర సంబంధ సమస్యలు ఎదురవుతుంటే కరోనా పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు