శారీరక శ్రమ లేదా? పొట్ట పెరిగిపోతుందా? లావైపోతున్నారా? ఐతే హృద్రోగ సమస్యలు తప్పవంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లకు తోడు.. గంటల పాటు కూర్చుని వుండటం ద్వారా చాలామందికి పొట్ట ముందుకు తన్నుకొచ్చేస్తుంది.
ఇంకా సన్నగా వున్నవారికి కూడా పొట్ట పెరిగిపోతే.. హృద్రోగాలు వచ్చే అవకాశం అధికమని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. 45 ఏళ్లు దాటిన 1500 మందిని పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. పొట్ట అధికంగా ఉన్నవారు వ్యాయామం చేయాలని, పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గించాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇంకా గ్రీన్, బ్లాక్ టీలను ప్రతిరోజూ తాగితే ఒబిసిటీ, మధుమేహం దూరమవుతాయని తద్వారా హృద్రోగ వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగిన వారి కొలెస్ట్రాయిల్ స్థాయి తగ్గడంతోపాటు మధుమేహ వ్యాధిగ్రస్థులకు చక్కెర స్థాయి తగ్గి షుగర్ అదుపులో ఉంటుందని.. మధుమేహులు గ్రీన్, బ్లాక్ టీ తాగితే వారి షుగర్ అదుపులో ఉందని వెల్లడి అయ్యింది.