రైల్వే స్టేషన్లలో ఉండే తాగునీటిని తాగితే? డయేరియా, క్యాన్సర్....

సోమవారం, 12 సెప్టెంబరు 2016 (17:53 IST)
రైలులో ప్రయాణం. వాటర్ బాటిల్స్ ఎందుకు అదో బరువు.. స్టేషన్లలో ఉండే వాటర్ తాగేస్తే పోలా.. అనుకుంటారు చాలామంది. అయితే అనారోగ్య సమస్యలు తప్పవండోయ్. రైల్వేస్టేషన్లలోని తాగునీటిని తాగితే రోగాల బారిన పడటం ఖాయమని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఈఎస్) తాజా ప్రకటన ద్వారా వెల్లడైంది. రైల్వే ప్రయాణీకులకు భారత రైల్వేశాఖ అందిస్తున్న సేవలు చాలా దారుణమని..  జాతీయ ఆరోగ్య, పర్యావరణ సంస్థ, జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో బయటపడిన వివరాలను బీఈఎస్ పేర్కొంది. 
 
రైల్వేస్టేషన్లలో లభించే వంద ఎమ్మెల్ నీటిలో పది యూనిట్ల థర్మోటోలరెంట్ క్లోరోఫామ్ బ్యాక్టీరియా ఉందని ఈ పరిశోధనలో తేలింది. ఈ నీటిని తాగడం వల్ల డయేరియా, గ్రాస్ట్రిక్, ఉదర సంబంధ వ్యాధులు తప్పవంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని, ఢిల్లీ, వారణాసి, పంజాబ్, గజియాబాద్ తదితర ప్రాంతాల రైల్వేస్టేషన్లలోని తాగునీటిలో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉందని ఆ పరిశోధన ద్వారా తెలిసిందని బీఈఎస్ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఈ బ్యాక్టీరియా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, పెద్దలను ఇబ్బందులకు గురిచేస్తుందని డాక్టర్ సురంజిత్ ఛటర్జీ వెల్లడించారు. 
 
రైల్వే ఫ్లాట్ ఫామ్‌లలో గల నీటి కుళాయిల్లోనూ, అక్కడ అమ్మబడే వాటర్ బాటిల్స్‌లోనూ ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. ఉత్తరాది ఈ బ్యాక్టీరియా ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియా ద్వారా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి