మార్నింగ్ వాక్... ఎందుకు చేయాలో చూస్తే ఖచ్చితంగా చేస్తారంతే...

బుధవారం, 23 మే 2018 (10:27 IST)
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాకింగ్ చేయడం ఎంతో లాభదాయకం. ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగకరమైనది, సులభతరమైనది. ఉదయం నిద్రలేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని నడక ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఉదయంపూట స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. సూర్యోదయ కిరణాలు శరీరానికి తగులుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. 
 
ప్రతి రోజు క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తుంటే శరీరంలోని కండరాలు బలిష్టంగా తయారవుతాయి. శరీరంలో ఉండే పనికిరాని కొవ్వు కరిగిపోతుంది. ఎంత ఎక్కువగా నడక సాగిస్తుంటే అంత ఎక్కువగా శరీరంలోని క్యాలరీలు కరిగి, ఊబకాయం తగ్గుతుంది. ప్రాతఃకాలంలో వచ్చే స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లో రక్తాన్ని శుభ్రపరిచేందుకు దోహదపడుతుంది. 
 
శరీరంలో ఆక్సీహిమోగ్లోబిన్ తయారవుతుంది. శరీరంలో ఆక్సీహిమోగ్లోబిన్ తయారవ్వడం వలన రక్తనాళాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. గుండె, రక్తపోటు, మధుమేహం తదితర రోగులు ఉదయంపూట నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇలా వాకింగ్ చేయడం వలన ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. 
 
మార్నింగ్ వాక్ చేయడం వలన శారీరక, మానసకిపరమైన ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి రోజు కనీసం మూడు కిలోమీటర్ల మేరకు నడవాలి. వారానికి ఐదు రోజులపాటు ఖచ్చితంగా నడిస్తే మంచిది. వాకింగ్ చేసే సమయంలో సౌకర్యవంతమైన చెప్పులు ధరించడం మంచిది. చుట్టూ తోట, ఉద్యానవనం లేదా ఖాళీ స్థలం ఉన్న ప్రాంతాల్లో నడిచేందుకు ప్రయత్నించాలా. 
 
నడిచే సమయంలో తేలికపాటి శ్వాస దీర్ఘంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకునేందుకు తగు మోతాదులో నీటిని సేవించుకోవాలి. మార్నింగ్ వాక్ చేసే ముందు, తర్వాత ఒక గ్లాసు నీటిని తప్పకుండా తీసుకోవాలి. వాకింగ్ చేసే సందర్భంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకూడదు. నడిచే సమయంలో మీ చేతులను చక్కగా నిటారుగా ఉంచి క్రమంగా వెనకకు, ముందుకు కదిలిస్తూ నడవాలి. దీంతో చేతులకు మంచి వ్యాయామం కలుగుతుంది. 
 
గుండె జబ్బులున్నవారు, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు లేదా ఇతర జబ్బులతో సతమతమౌతున్నవారు వాకింగ్ చేయాలంటే వైద్యుల సలహా తీసుకోవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తి తమ తమ వయసుకు తగ్గట్టు, వారి సామర్థ్యం మేరకు నడవాల్సివుంటుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం ఉరుకులపరుగులమయమైన జీవితంలో కనీసం 20-25 నిమిషాలను మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోవాలి. కాలుష్య రహిత వాతావరణంలో ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిని మీ శరీరానికి తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు