ఆకుకూరలతో ఆయుష్షు పెంచుకోండి..

సోమవారం, 4 డిశెంబరు 2017 (10:00 IST)
అవునండి.. ఆకుకూరలతో ఆయుష్షును పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలను రోజు ఒక కప్పైనా డైట్‌లో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరమవుతాయని వారు చెప్తున్నారు. ఆకుకూరల్లో చాలా ప్రోటీన్స్ వుంటాయి. ఆకుకూరల్లో పలురకాలు వుంటాయి. రోజుకో ఆకుకూర డైట్‌లో చేర్చుకోవాలి. ఆకు కూరల్లో పొన్నగంటి కూరకు చాల ప్రత్యేకమైన స్థానం ఉంది. 
 
ఎందుకంటే ఇందులో అనేక పోషక విలువలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొన్నగంటి కూరలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం సమృద్దిగా ఉంటాయి. ఇంకా శరీరానికి తోడ్పడే ఎమినో ఆమ్లాలు పొన్నగంటి కూరలో పుష్కలంగా వున్నాయి.
 
మొలలతో బాధ పడేవారికి పొన్నగంటి కూర ఆకులు, చిన్న ఉల్లిపాయలు, మిరియాలతో చేసిన సూప్ త్రాగితే మంచిది. పొన్నగంటి కూరలో లభించే నూనే పదార్థాలు అధిక రక్త పోటును తగ్గిస్తాయి. అంతేకాదు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చేసి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. పొన్నగంటి ఆకులు నిద్రలేమిని దూరం చేస్తాయి. జ్ఞాపక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకోవాలి.

గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. కంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటి సమస్యలు ఎదురైతే.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు