చుండ్రు పోవడానికి సులువైన మార్గం..?

సోమవారం, 8 జూన్ 2020 (21:38 IST)
ఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు. వయస్సుతో సంబంధం లేకుండా పెద్దవారికి చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారపర్యంగా కూడా వస్తుంది. అధిక ఒత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. ఒత్తిడికి గురైన వారికి చుండ్రు అధికంగా వస్తుంది. కాలాలు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రును పెంచుతాయి. 
 
అయితే తలలో చుండ్రు వస్తే అంతకుముందు ఆహారపదార్థాలు ఏం తీసుకున్నారో గమనించాలి. తినే ఆహారంలో మార్పు వచ్చినా చుండ్రు వస్తుంది. దాని నివారణకు ఎక్కువ ఆకు కూరలు పీచు పదార్థం విటమిన్ ఎ ఎక్కువగా ఉండే పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
అలాగే కాయగూరలు, చేపలను ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పదార్థాలు, ఎక్కువగా వేడిని ఉండే పదార్థాలను తినకూడదు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలట. తలను ఎప్పుడూ కప్పి ఉంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరచుగా తలకు షాంపూ పెట్టి సరైన కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు తలను శ్రద్థగా శుభ్రపరచాలి, మాయిశ్చరైజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్‌ను వాడితే చర్మం పొడిగా అవదు.
 
ఇతరులు వాడిన దువ్వెన, బ్రష్‌లను ఉపయోగించకూడదు. వాటి వల్ల ఇతరులకు తలలో ఉండే చుండ్రు మీకు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మీరు చుండ్రుతో బాధపడుతుంటే జుట్టు దువ్వుకున్నాక వెంటనే దువ్వెనను బ్రష్‌తో శుభ్రపరుచుకోవాలి. ఆరు చెంచాల నీళ్ళలో రెండు చెంచాలు వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక వెనిగర్ నీళ్ళను తలకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడు నెలలు  చేస్తే చుండ్రు తగ్గుతుంది. తలస్నానం చేయకుండా అరగంట ముందు పుల్లగా ఉండే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల తలలో చుండ్రు రాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు