భారతదేశ సంస్కృతిలో శాఖాహారాన్నికున్న గొప్పతనం మరెందులోను లేదు. కాని శాస్త్రజ్ఞులు, పరిశోధనకర్తలు రకరకాల పరిశోధనలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి శాఖాహారమే ఉత్తమమని వెలుగెత్తి చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది శాఖాహారంవైపు మొగ్గు చూపిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ 1977 నుంచి అమెరికాలో ప్రపంచ శాఖాహార దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించింది. సోసైటీ శాఖాహారానికి సంబంధించిన విలువలను ప్రజలకు వివరించేందుకుగాను చాలా సదస్సులు నిర్వహించింది. శాఖాహారానికి సంబంధించి సొసైటీ చాలా పరిశోధనలుగావించింది. తెలుసుకోదగ్గ విషయమేంటంటే సొసైటీ ప్రారంభించిన తర్వాత అమెరికాలో దాదాపు 10 లక్షలమంది స్వతహాగా మాంసాహారాన్ని త్యజించారనడంలో అతిశయోక్తి లేదు.
శాఖాహారంలో శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకపదార్థాలు, ఇనుము, ఖనిజపదార్థాలు తదితర ఉపయోగకరమైనవి ఉన్నాయని ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా డైటీషియన్ డాక్టర్. అమిత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఇలాంటి భోజనంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఊబకాయం బారినపడకుండా ఉండగలరని ఆయన తెలిపారు. మాంసాహారం తీసుకునేవారిలోకన్నా శాఖాహారం తీసుకునేవారిలో కొవ్వుశాతం తక్కువగా ఉంటుందని, దీంతో గుండె జబ్బులు తక్కువగా వచ్చే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.
ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకునేవారిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని ఇవి క్యాన్సర్‌ను దరిచేరనీయవని మరో డైటీషియన్ 'డాక్టర్.అంజుమ్ కౌసర్' తెలిపారు.