గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు జీర్ణక్రియ సులభంగా జరగడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని పదార్థాలు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, గ్యాస్, ఉబ్బరం, గుండెలో మంట వంటి సమస్యలకు దారితీస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తినకూడని కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ చికెన్, పిజ్జా, మరియు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం వంటివి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి గ్యాస్ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. పచ్చి మిరపకాయలు, హాట్ సాస్, అధిక మసాలాలు ఉన్న పదార్థాలు కడుపులో మంటను పెంచుతాయి.
మినపప్పు వంటి కొన్ని పప్పులు అధిక ప్రోటీన్, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి. బంగాళాదుంపలలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే క్యాబేజీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి కూడా కొందరిలో గ్యాస్ సమస్యలను పెంచుతాయి.
సోడా, కూల్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలు గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతాయి. టీ, కాఫీలలో ఉండే కెఫీన్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది, గుండెలో మంటకు దారితీస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. చక్కెర అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఊరగాయల్లో వెనిగర్, అధిక మసాలాలు ఉండటం వల్ల అవి కూడా ఎసిడిటీని పెంచుతాయి.
మైదా, పేస్ట్రీలు వంటివి జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఈ పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు, నీరు ఎక్కువగా తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి కూడా పాటించాలి. ఏదైనా కొత్త ఆహారాన్ని డైట్‌లో చేర్చుకునే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.