ఆరోగ్యంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే కంటినిండా నిద్రపోవాలి. అంటే ఒక రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. కానీ నేటి హైటెక్ జీవితంలో ప్రతి ఒక్కరూ ఉరుకులపరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. దాంతో చాలామంది నిద్రకు దూరమవుతున్నారు. మరికొందరు స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లతో రాత్రుళ్లు గడుపుతున్నారు. ఫలితంగా నిద్రకు పూర్తిగా దూరమవుతున్నారు.
వాస్తవానికి ప్రతి వ్యక్తికీ నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. కనుక వీలైనంత వరకు తగినన్ని గంటల పాటు ఖచ్చితంగా నిద్రిస్తే మంచిది. లేదంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. రాత్రివేళ నిద్ర సరిగ్గా పోకపోతే మరుసటి రోజంతా బడలికగా ఉంటుంది. పైగా, ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది.
అంతేకాకుండా, నిద్రలేమి శరీర రోగనిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. తద్వారా హైబీపీకి లోనవుతారు. నిద్ర లేకపోతే గుండె వ్యాధులు, ఎముకలు బలం కోల్పోయి పెళుసుగా మారిపోతాయి. దాంతో మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు లేకపోలేదు. నిద్రలేమి వలన మెదడుపై ప్రభావం చూపుతుంది. దాంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. ఏ విషయంలోను సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాదు.