పచ్చటి గార్డెన్‌ మెత్తటి గడ్డిపై వ్యాయామం చేస్తే ఏమవుతుంది?

గురువారం, 6 జులై 2017 (16:15 IST)
అడవుల నరికివేత ఎక్కువై ప్రాణవాయువు తక్కువవుతున్న తరుణంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమతమ ఇంటి ఆవరణలో చక్కగా పచ్చగడ్డితో వుండే గార్డెన్లను ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం చక్కగా ఆ పచ్చికబయళ్లలో వ్యాయామం చేస్తారు. ఐతే ఇది అందరికీ సాధ్యం కాదు. మధ్యతరగతి ప్రజలకు ఇలాంటివి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఏవైనా పార్కుల్లో... అదికూడా బాగా పచ్చని పచ్చికబయలు వున్నటువంటి గార్డెన్లు చూసుకుని వ్యాయామం చేయాలి. ఎందుకంటే పచ్చటి పచ్చిక గల పార్కుల్లో వ్యాయామం చేస్తే మెదడుకు ఎంతో హాయిని ఇస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
పచ్చటి పచ్చిక పెరిగిన ప్రాంతాల్లో, సహజమైన గాలి, కాలుష్యరహిత ప్రాంతాల్లో వ్యాయామం చేయడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ స్టడీ నిర్వహించిన సర్వేలో తేలింది. గార్డెన్, పార్క్‌ల్లో కేవలం ఐదు నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మెదడుకు ఎంతో మంచిదని ప్రొఫెసర్ జూల్స్ ప్రెటీ చెప్పారు. 
 
1,252 మందిపై జరిగిన పరిశోధనలో ఈ విషయం తెలియ వచ్చింది. మహిళలు, పురుషులు పాల్గొన్న ఈ పరిశోధనలో వివిధ వయోపరులు కూడా పాలుపంచుకున్నారు. పచ్చటి వాతావరణంలో ఐదు నిమిషాల పాటు వ్యాయామం చేసిన వారికి సెల్ఫ్ ఎస్టీమ్ పెరగడంతో పాటు మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుందని తేలింది.
 
యూకేలోని ఎసెక్స్ యూనివర్శిటీకి చెందిన పీహెచ్‌డీ పరిశోధకులు మొత్తం 1252 మందిపై సర్వే నిర్వహించారు. ఇందులో వివిధ రకాల వయస్సుగల వారిపై ఈ సర్వేను చేశారు. పచ్చని మైదానంలో కేవలం ఐదు నిమిషాలు వ్యాయామం చేస్తే మనస్సుకు ఎంతో ప్రశాంత చేకూరుతుందని ఇందులో తేలిందన్నారు.

వెబ్దునియా పై చదవండి