ఇంగువ వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం. కూరలు, వేపుళ్లు చేసినప్పుడు తాలింపులో కాస్త ఇంగువ వేయడం జరుగుతుంది. అదనపు రుచి, వాసన కోసం ఉపయోగించే ఇంగువలో మన శరీరానికి మేలు చేసే పోషకాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇందులో కాల్షియం, పాస్పరస్, ఇనుము, విటమిన్- బి లాంటి ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. మరి ఇంగువ వలన మన ఆరోగ్యానికి జరిగే మేలేమిటో చూద్దాం.
2. అజీర్తితో బాధపడేవారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
3. ఒక చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది. జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. అంతేకాకుండా శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
4. క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్ సమస్య బాధించదు.