బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ను ఎంపికయ్యారు. ప్రతిపక్ష మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పాట్నాలో జరగనున్న కూటమి సంయుక్త మీడియా సమావేశంలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, పాట్నాలోని మౌర్య హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యానరులో కేవలం తేజస్వీ యాదవ్ భారీ ఛాయాచిత్రాన్ని మాత్రమే ఉంచారు. దానిపై 'బిహార్ మాంగే తేజస్వీ సర్కార్' (బిహార్ తేజస్వీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది) అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ప్రముఖంగా ప్రదర్శించారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మహాకూటమి నేతలంతా కలిసి నిర్వహిస్తున్న తొలి సంయుక్త ప్రెస్‌మీట్ ఇదే కావడం గమనార్హం.
ఈ కీలక పరిణామానికి ఒకరోజు ముందు, బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, బీహార్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కృష్ణ అల్లవారపు.. తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాతే తేజస్వీ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు, తేజస్వీ పేరును ప్రకటించడంలో జాప్యంపై కూటమిలో అసంతృప్తి పెరుగుతోందని భాగస్వామ్య పక్షమైన సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య సూచనప్రాయంగా తెలిపారు. "మహాకూటమి అధికారంలోకి వస్తే తేజస్వీయే ముఖ్యమంత్రి అవుతారని యావత్ బిహార్‌కు తెలుసు. గురువారం నాటి ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ మాత్రం ఆచితూచి మాట్లాడుతూ.. అన్ని గందరగోళాలకు గురువారం తెరపడుతుందని మాత్రమే తెలిపారు.
వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికలకుగానూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ బహిరంగంగా సమర్థించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం ఇంతకాలం తేజస్వీని ఏకగ్రీవ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి వెనుకాడింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.