గోరింటాకు రెమ్మలు కణతలపై ఉంచుకుంటే...

మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (16:32 IST)
వేసవిలో భానుడి తాపానికి జుట్లు చివర్లు చిట్లిపోయి, రాలిపోవటం, తలంతా జిడ్డుగా తయారవటంలాంటివి మామూలే. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా జుట్టు సంరక్షణకి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే... 
 
కాసిన్ని వేడినీళ్లలో గోరింటాకులు వేసి బాగా మరగబెట్టాలి. ఆ నీటిని వడకట్టి తలకు మర్దన చేసుకుంటే వేడి తగ్గుతుంది. మాడు చల్లబడుతుంది. ముఖ్యంగా ఎండాకాలం శరీరానికి ఉపశమనం చేకూరుస్తుంది. అంతేకాదు జుట్టు కూడా మరింత మృదువుగా తయారవుతుంది.
 
వేసవిలో చెమట వల్ల చుండ్రు వచ్చే అవకాశాలు చాలా ఉంది. చుండ్రును వదిలించుకోవడానికి రకరకాల షాంపూలు వాడుతుంటాం. అవి వాడుతున్నంత సేపు చుండ్రు తగ్గుతుంది. షాంపూ వాడటం మానేస్తే మళ్లీ వస్తుంది. కాబట్టి హెర్బల్‌ రెమిడీ అప్లై చేయడం ఉత్తమం. అందులో గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. గోరింటాకులు, మెంతులు, ఆవనూనెలతో ఉడకబెట్టి చల్లార్చాలి. కాసేపయ్యాక పిండికొట్టి జుట్టుకు పట్టించుకుంటే మంచిది.
 
ఎండాకాలం తీవ్రమైన తలనొప్పితో చాలామంది సతమతమవుతుంటారు. అందుకోసం గోరింటాకు రెమ్మలు, పూలు రెండింటినీ వెనిగర్‌లో కాసేపు ఉంచాలి. వీటన్నింటినీ మెత్తగా చేసుకుని కణతలకు రాసుకోవాలి. ఆ ముద్దను కాసేపు కణతల మీదే ఉంచాలి. దీనివల్ల శరీరంలోని వేడి తగ్గిపోయి.. తలనొప్పి తీవ్రత తగ్గే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి